నెల్లూరు జిల్లాలో రైల్లో తెలంగాణ లేడీ పోలీసు అధికారిపై దాడి: దోపిడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులో తెలంగాణకు చెందిన మహిళా పోలీసు అధికారిపై దుండగులు దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లోని బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న తెలంగాణ అప్పా డిప్యూటీ డైరెక్టర్ ఎస్ఎం రత్నంపై దుండగులు దాడి చేసి ఆమె నుంచి బంగారు గొలుసు, రెండు వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులో ఆమె గూడూరు వెళ్తుండగా ఆ దాడి జరిగింది. బోగీలో ఒక్కరే ఉండడం, సివిల్ డ్రెస్‌లో ఉండడం కారణంగా దుండగులు దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. అధికారిపై దాడి చేసి దోపిడీ చేసిన తర్వాత రైలు వేగం తగ్గగానే దూకి దుండగులు పారిపోయారు.
రత్నం చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ రైలు తప్పిపోవడంతో ఆమె సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కువగా ప్రయాణికులు నెల్లూరు వరకే ఉంటారు. ఆ తర్వాత ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటారు. రత్నంపై దాడి జరిగిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ పోలీసులకు తెలియజేశారు.












Click it and Unblock the Notifications