వారు చెప్తేనే రాజకీయాల్లో ఉన్నా!, మనం ధీరులం: కేసీఆర్
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం సాధించాక తాను తప్పుకుంటానని భావించానని, కానీ కొందరు మేధావులు తెలంగాణ పునర్నిర్మాణంలో తాను ఉండాలని సూచించారని అందుకే ఉన్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం అన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. మనమంతా (తెరాస) ధీరులం అని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పటికీ ఉండదని చాలామంది చెప్పారన్నారు. తెలంగాణ కోసం 36 పార్టీలను తాము ఒప్పించగలిగామని చెప్పారు. రాష్ట్ర సాధనలో ధీరులుగా వ్యవహరించిన వారు లక్షలాది మంది కార్యకర్తలే అన్నారు. ఉద్యమం సమయంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయన్నారు.
వాటన్నింటిని మనం తట్టుకున్నామని చెప్పారు. 2014లో తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుందన్నారు. ఆ తర్వాత తాను తప్పుకునేందుకు సిద్ధపడగా.. చాలామంది మేధావులు, రాజకీయ నాయకులు తన పైన తెలంగాణ బాధ్యత వేశారన్నారు.

తెలంగాణ సాధించిన నీవే.. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత తీసుకోవాలని మేధావులు తనకు చెప్పారన్నారు. తమ ప్రభుత్వం గెలిచాక, కూలిపోతుందని కూడా విమర్శలు చేశారన్నారు. కానీ ధీరులైనవారే అవరోధాలను పక్కన పెట్టి లక్ష్యం దిశగా ముందుకు వెళ్తారన్నారు. ప్రజలు తమకు అసాధారణ తీర్పు ఇచ్చారన్నారు.
మూర్ఖుడు పనిని ప్రారంభించడని, కొందరు పనిని మధ్యలోనే ఆపేస్తారని, ధీరులే పనిని ముందుకు తీసుకు వెళ్తారన్నారు. అలా మనం తెలంగాణను సాధించామని, ఇప్పుడు బంగారు తెలంగాణ సాధన దిశలో వెళ్తున్నామని కెసిఆర్ చెప్పారు. తమ పార్టీకి తెలంగాణ ప్రజలు మాత్రమే బాసులు అన్నారు.
ఏం జరుగుతుందోనన్న భయంతో నీచ మానవులు పనిని ప్రారంభించరని, ధీరులే గొప్ప పనులు ఆరంభించి ఫలితాలు రాబడతారని కెసిఆర్ అన్నారు. ఆరంభింపరు నీచ మానవులు అనే పద్యంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications