హైదరాబాద్‌లో విషాదం : వీధి కుక్కల దాడిలో మరో బాలుడు బలి..!
ఈ మధ్యకాలంలో పసిపిల్లలపై వీధికుక్కల దాడులు ఎక్కువయిపోయాయి. కుక్కలదాడిలో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, హైదరాబాద్ నగరంలో అయితే ఇలాంటి సంఘటనలు రోజుకొకటి చూస్తున్నాం. ఇటీవల కాలంలో నగరంలోని చాలా మంది వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా, ఇప్పడు వీధి కుక్కల దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని మియాపూర్ మక్తా మహబూబ్‌పేట్‌లో చోటుచేసుకుంది.
పూర్తి సమాచారం మేరకు.. మహబూబ్‌పేట్ బస్తీకి చెందిన సాత్విక్ అనే ఆరేళ్ల చిన్నారి నిన్న రాత్రి ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఎంతసేపటికి బాలుడు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో బాలుని కుటుంబ సభ్యులు రాత్రి వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. తమ బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరాతీసారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం స్థానికంగా ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఓ చిన్నారి మృతదేహం కనిపించడంతో అందరూ అక్కడికి వెళ్లారు. చనిపోయింది ఆ బాలుడేనని గుర్తించారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

అక్కడి మృతేదహాన్ని పరిశీలించారు. అయితే, ఆ బాలుని ఒంటిపై కుక్కల కాట్లు ఎక్కువగా కనిపించాయి. వాటిని చూసిన పోలీసులు ఆ చిన్నారిని కుక్కలు దాడి చేసాయని గుర్తించారు. ఆ మృతదేహం పక్కనే డంపింగ్ యార్డ్ కూడా ఉంది. దీంతో అక్కడ నిత్యం కుక్కలు ఎక్కువగా ఉంటాయని, అవి అటుగా వెళ్లేవారిపై ఎప్పుడూ దాడులు చేస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ చిన్నారిని కూడా కుక్కలు దాడి చేసి చంపి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లీదండ్రులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications