అంతకన్నా మూర్ఖత్వం ఉండదు- రేవంత్ నోట..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు తరచూ గుప్పిస్తోన్న విమర్శలపై స్పందించారు. వాటికి తెర దించే ప్రయత్నం చేశారు. తనకు ఎవరూ శత్రవులు లేరని, ఎవరినీ శత్రువుగా చూడననీ తేల్చి చెప్పారు.
తెలంగాణ జెన్ కో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాక్కులమ్మ ప్రచురణ నుంచి వెలువడిన హసిత బాష్పాలు కావ్యరూపం పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.రచయిత శ్రీరామ్, అందెశ్రీని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు.

ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తన జీవిత ఆశయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్య పరిష్కరించడానికి తనకు ఒక అవకాశం వచ్చిందంటే శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉన్నాయని తాను బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
ఒక సాధారణ వ్యవసాయ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేయకుండా, ఎవరో నచ్చలేదని వారిపై ఈ అధికారాన్ని వినియోగిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎవరినీ శత్రువుగా చూడనని పేర్కొన్నారు.
తాను కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తానని రేవంత్ చెప్పారు. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009 ఎమ్మెల్యేగా, 2014 లో ఎంపీగా, 2023 సీఎంగా.. తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యతను తన భుజాలపై పెట్టారని గుర్తు చేసుకున్నారు. అలాంటి అధికారాన్ని ఎవరో నచ్చలేదని వారిపై ప్రయోగిస్తే అది మూర్ఖత్వమే అవుతుందని అన్నారు.
ఏ హోదా నిర్వహించకుండానే, ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ఈ పదవిలోకి వచ్చానంటే భగవంతుడు ఏదో బాధ్యత నాపై పెట్టాడని బలంగా నమ్ముతానని అన్నారు. దేశం స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని పేర్కొన్నారు. పేదవాడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతకగలగాలని, సొంతింటి కల నిజమైనప్పుడే అట్టడుగు ప్రజలు ఆత్మగౌరవడంతో నిలబడగలుగుతారని చెప్పారు. అందుకోసమే తొలి విడతగా నాలుగు లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లను చేపట్టామని వివరించారు.
పేద ప్రజలుసన్నబియ్యంతో అన్నం తింటున్నారంటే అది వారికి ఆత్మగౌరవమని, నేడు రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రాక, తమకంటూ ఒక గుర్తింపు లేదని బాధ పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులను అందిస్తోందని పేర్కొన్నారు.
తానేమీ గొప్పవాడిని కానని, అందరిలో ఒకడినేనని రేవంత్ చెప్పారు. గూడ అంజన్న, దాశరధి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణ రావు, అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న లాంటి ఎందరో మహానుభావులు ప్రజలను చైతన్య వంతులను చేయడంలో, తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిని నింపడంలో ఎంతగానో కృషి చేశారని అన్నారు.
ఉద్యమకారులనే గొప్ప పదాన్ని తమకు తాముగా ఆపాదించుకోవడం సరికాదని రేవంత్ వ్యాఖ్యానించారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఉద్యమకారుడినని చెప్పుకోరని అన్నారు. చాలా మంది ఉద్యమకారులు ఆస్తులు, అంతస్తులు సర్వస్వం కోల్పోయారని పేర్కొన్నారు. అందెశ్రీ, గద్దర్ లాంటి వారు ఏమీ ఆశించకుండా ప్రజలకు ప్రేరణ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో నడిచారని చెప్పారు.












Click it and Unblock the Notifications