TSPSC Paper leak: 144 సెక్షన్ విధింపు- రేపు యూనివర్శిటీల బంద్..!!
సంచలనం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత ముదురుతోంది. విద్యార్థి సంఘాలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మొదలైన ప్రవీణ్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ లీక్ అయింది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదంతం అభ్యర్థులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

14 రోజుల రిమాండ్..
ఈ కేసులో తొమ్మిదిమందిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని చంచల్ గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసును ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కు బదలాయించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
పేపర్ లీక్ ఉదంతం తెలంగాణలో ప్రకంపనలు రేపింది. ప్రభుత్వం ఘోర వైఫల్యం వల్లే పేపర్ లీక్ అయిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున ముట్టడించారు. గేటును దాటి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు, బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముట్టడించారు. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ కూడా..
కాగా- ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి లేఖ రాశారు. పేపర్ లీకేజీపై 48 గంటల్లోగా వివరణాత్మకమై సమగ్ర నివేదికను తనకు అందజేయాలని ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్షలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఆధారపడి ఉన్నందున భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్శిటీల బంద్..
నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అటు అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులు గురువారం నాడు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బంద్ కు కూడా పిలుపునిచ్చాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీలన్నీ బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా యూనివర్శిటీల క్యాంపస్ లల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

144 సెక్షన్ విధింపు..
ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అయిదు మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని ఆదేశించారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications