TSPSC Paper leak: ఆ పరీక్ష రద్దు- వేలాదిమంది అభ్యర్థుల భవిష్యత్..
సంచలనం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ నెల 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను అధికారులు రద్దు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మొదలైన ప్రవీణ్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన వార్తలు నిజం అయ్యాయి. ఏఈ పరీక్షా పత్రం లీక్ అయినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ధారించారు. దీనితో ఆ పరీక్షను రద్దు చేశారు.

837 పోస్టులు..
ఈ నెల 5వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 837 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 55 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

మళ్లీ ఎప్పుడు..?
తాజాగా- ఏఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలో- దీన్ని రద్దు చేశారు. ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్షను నిర్వహించారు. లీక్ నేపథ్యంలో దీన్ని అధికారులు రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
పేపర్ లీక్ ఉదంతం తెలంగాణలో ప్రకంపనలు రేపింది. ప్రభుత్వం ఘోర వైఫల్యం వల్లే పేపర్ లీక్ అయిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున ముట్టడించారు. గేటును దాటి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు, బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముట్టడించారు. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రేపు యూనివర్శిటీల బంద్..
నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అటు అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులు గురువారం నాడు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బంద్ కు కూడా పిలుపునిచ్చాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీలన్నీ బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా యూనివర్శిటీల క్యాంపస్ లల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో..
ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అయిదు మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని ఆదేశించారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications