తెలంగాణలో గ్రూప్ 2 కొత్త తేదీలొచ్చేశాయ్: ఆ తప్పులు మళ్లీ చేయకుండా..
హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్ పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త వినిపించింది. ఇటీవలే వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది.
గ్రూప్ 2లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన టీఎస్‌పీఎస్సీ.. 29/2022 నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షల కోసం సన్నద్ధమౌతోన్నారు.

గ్రూప్ 2 కింద ఖాళీగా ఉన్న 783 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు పరీక్షలను రాయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఈ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటానికి గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిని నవంబర్ 2, 3 తేదీల్లో రీ షెడ్యూల్ చేసింది టీఎస్‌పీఎస్సీ. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మళ్లీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను షెడ్యూల్ చేశారు.
పరీక్షల తేదీకి వారం రోజుల ముందు అభ్యర్థులు.. https://www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అత్యంత పకడ్బందీగా ఈ పరీక్షలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లను తీసుకుంటోన్నామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దీనిపై ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications