ఇండిగో విమానాలకు రెండు బాంబు బెదిరింపు కాల్స్: హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్
ఇండిగో విమానాలకు ఒకటే రోజు రెండు బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. ఓ ఘటన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకోగా, మరో ఘటన ఢిల్లీలో జరిగింది.
హైదరాబాద్: విమానాలకు బెదిరింపు కాల్స్ చేయడం లాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా, ఇండిగో విమానాలకు ఒకటే రోజు రెండు బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. ఓ ఘటన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకోగా, మరో ఘటన ఢిల్లీలో జరిగింది. శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, శంషాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాంటిదేమీ లేదని తేల్చారు. అయితే, భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన అతడు.. ఆలస్యంగా రావడంతో విమానాశ్రయ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో డయల్ 100కి ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడు.

సాంకేతిక ఆధారాలతో భద్రయ్యను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాన్ని అందుకోలేక పోయానని, బాంబు ఉందని చెబితే విమానం లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో అంగీకరించాడు భద్రయ్య. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మరో ఘటన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి ఒడిశాలోని దేవ్‌గఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే విమానం టేకాఫ్ అవడంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని లక్నోకి మళ్లించారు. అక్కడ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఒడిశా వెళ్లేందుకు అనుమతించినట్లు ఇండిగో వెల్లడించింది. బెదిరింపు కాల్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications