మొన్న అదృశ్యమైన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకొని వచ్చారు
హైదరాబాద్: మూడు రోజుల క్రితం హైదరాబాదులో అదృశ్యమైన యువతులు పెళ్లి చేసుకొని వచ్చారు. శుక్రవారం ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఆయితే, అందులో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో విద్యార్థిని క్షేమంగా ఇంటికి చేరుకుంది.
18న జవహర్‌నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని (21), ఆమె అత్త కూతురు (17) హాల్ టిక్కెట్ తీసుకోవడం కోసమని ఇంటి వద్ద చెప్పి వెళ్లారు. వారు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో వారి సోదరులు జూబ్లీహిల్స్ పోలీసులకు విషయం తెలిపారు.
మరో ఘటనలో ఇదే రోజు కార్మికనగర్ ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని(20) డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పరీక్ష రాయడానికి చార్మినార్‌కు వెళ్లిన కార్మికనగర్ విద్యార్థిని స్థానికంగా ఉండే ఓ ఆటో డ్రైవర్‌ను యాదగిరిగుట్టలో వివాహం చేసుకొని శనివారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు రక్షణ కల్పించాలని కోరింది. పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిచి మేజరని, ఆమె పెళ్లి చేసుకుందని వారి దృష్టికి తీసుకెళ్లారు.
మరో ఘటనలో అదృశ్యమైన వదినామరదళ్లలో వదిన వరంగల్‌లో ఓ యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వరంగల్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వదినతో కలిసి వెళ్లిన మరదలు తిరిగి నగరానికి చేరుకుని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో వివరాలను తెలిపింది. శనివారం ఆ జంట కూడా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications