బ్యుటిషియన్‌ను బురిడీ కొట్టించిన లేడీ కిలాడీలు: అరెస్టు
హైదరాబాద్: బంగారం పేరుతో బ్యూటీషియన్‌ను మోసం చేసిన ఇద్దరిని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 40వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్‌లో అఫ్రీన్ బ్యూటీ పార్లర్‌ను సుల్తానా బేగం గత కొంత కాలంగా నిర్వహిస్తున్నారు.
గత నెల 28వ తేదీన సంగీత అలియాస్ నర్సమ్మ, లక్ష్మి అనే ఇద్దరు మహిళలు వచ్చారు. ధనవంతులుగా నటించారు. సంగీత ఫేషియల్ చేయించుకుంది. బిల్లు కట్టే క్రమంలో సుల్తానాబేగంతో ఇద్దరూ మాటలు కలిపారు. తమ వద్ద బంగారం ఉంది తక్కువ ధరకు ఇస్తామని చెప్పారు. బంగారు బిస్కెట్ చూపించారు. సుల్తానా బేగం నమ్మలేదు. అంతా మోసం అని చెప్పింది.

కంసాలికి చూపించిన తరువాత కొనుక్కోమంటూ ఓ గ్రాము అసలు బంగారాన్ని ఆమెకు ఇచ్చారు. దాన్ని కంసాలికి చూపించగా నిజమైన బంగారమని చెప్పాడు. సుల్తానా నగలు కుదవపెట్టి 75 వేల రూపాయలు అప్పుగా తెచ్చింది. మరుసటి రోజు లక్ష్మి, నర్సమ్మ నకిలీ బంగారు బిస్కెట్ తీసుకుని వచ్చారు. ఇది 20 తులాలని, లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగారు.
తనవద్ద అంత లేదని 75 వేలు ఇస్తానని సుల్తానా బేగం చెప్పింది. డబ్బులు తీసుకుని బిస్కెట్ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత దాన్ని అమ్మేందుకు సుల్తానా ప్రయత్నించగా నకిలీదని తేలింది. బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని లక్ష్మి, నర్సమ్మను అరెస్టు చేశారు. నకిలీ బంగారం బిస్కెట్‌లను స్వాధీనం చేసుకున్నామని డీఐ ముత్తు తెలిపారు.












Click it and Unblock the Notifications