చంచల్ గూడ జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి అంతకుముందు అత్తాపూర్ పోలీసులు వైద్య పరీక్షలకు తరలించారు. అత్తాపూర్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతకుముందు సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అశోక్ నగర్ కు తీసుకొచ్చారు. అశోక్ నగర్ లో అద్దెకు ఉన్న ఇంటిని పరిశీలించారు. ఇక అంతకుముందు పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
జాతీయ పోలీస్ అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జూలై 18న కేసు నమోదు చేశారు. అత్తాపూర్ స్టేషన్ లో ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్)లోని మహిళపై దాడి, లైంగిక వేధింపులు, వెంటాడడం.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం అలాగే అక్రమ నిర్బంధం, గాయపరచడం, బెదిరింపు తదితర సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని 66 ఈ, 67 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ మేరకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు నమోదైన రోజే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో మెడపై, గొంతు నులిమినట్లు ఉన్న గాయాలకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించారు. అలాగే బాధితురాలి చెంప వద్ద కమిలిన గాయాలు, ఎడమకాలు చర్మంపై గాయం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు.

మరోవైపు అత్తాపూర్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసుపై గతంలో వాదనలు విన్న హైకోర్టు.. అదనపు పీపీ జితేందర్ రావు వివరాలు సమర్పించడానికి సమయం కోరడంతో తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications