తెలంగాణలో మరో చర్లపల్లి రైల్వే స్టేషన్..
Yadadri Railway Station: తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ కింద తెలంగాణలో సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

మొదటి విడతలో ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది సంబంధిత మంత్రిత్వ శాఖ. దీనికోసం ఒక్కో రైల్వే స్టేషన్‌కు గరిష్ఠంగా 25 కోట్ల రూపాయలను కేటాయించింది కూడా. దీని ఆధారంగా అక్కడి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి స్టేషన్ అభివృద్ధికి 24.45 కోట్ల రూపాయలను కేటాయించింది.
దీనికి సంబంధించిన పనుల పురోగతిని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్లాట్ ఫామ్‌పై నిర్మాణంలో ఉన్న షెడ్ల ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటిదాకా 38 శాతం పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. ప్లాట్‌ఫామ్ కాలమ్స్ నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఇక స్టేషన్ భవనం, అదనపు ప్లాట్ ఫామ్‌లు నిర్మాణ దశలో ఉన్నట్లు వివరించారు.

ఇదే అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైతం పునర్నిర్మితమౌతోన్న విషయం తెలిసిందే. 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది.












Click it and Unblock the Notifications