నోట్ల రద్దుకు అనుకూలంగా ర్యాలీ, 'మోడీది తుగ్లక్ పాలన, కేసీఆర్ భేటీపై అనుమానం'
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దుకు మద్దతుగా తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్ మలక్‌పేటలో భారీ ర్యాలీ నిర్వహించింది. ముసారాంబాగ్ కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.
అవినీతిని నిర్మూలించేందుకు, నల్లధనాన్ని వెలికితీసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశ ప్రజలందరూ మోడీకి అండగా నిలబడాలని వారు విజ్ఞప్తి చేశారు.

నోట్ల రద్దు వల్ల ఇబ్బంది కలుగుతోంది: హరీష్
నోట్ల రద్దు వల్ల ఇబ్బంది కలుగుతోందని మంత్రి హరీష్ రావు చెప్పారు. నాబార్డు నుంచి రాష్ట్రాలకు ఇచ్చే రుణం విషయంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బంది ఉందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు.
మోడీపై ఉత్తమ్ ఆగ్రహం
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి కాంగ్రెస్ శ్రేణులు సహాయ సహకారాలు అందించాలన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ అనాలోచిత చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. కేంద్రంలోని మోడీ పాలన మరో తుగ్లక్ పాలనను ప్రతింబింబిస్తోందన్నారు. కేసీఆర్, మోడీ సమావేశంపై ప్రజల్లో చాలా అనుమానాలున్నాయన్నారు.












Click it and Unblock the Notifications