సీఎం కేసీఆర్ అందుకే ఆస్పత్రిపాలయ్యారు: విజయశాంతి విమర్శలు
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పటాన్ చెరులోని బీరంగూడ గుట్టపై జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ నేత విజయశాంతి పాల్గొన్నారు. మహిళలు.. ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వారని ఆమె అన్నారు. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం అని చెప్పారు. మహిళ అంటే భాధ్యత, బాధ్యత అంటే మహిళ అని అన్నారు. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ అని చెప్పారు.

ఇలాంటి సీఎం కావాలా?: కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్‌ను తుంగలో తొక్కాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. సమాజంలో డ్రగ్స్‌కి బానిసై యువత... తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని ఆమె ఆరోపించారు. మద్యానికి బానిసలుగా మారి అడబిడ్డలను మానభంగాలు, హత్యలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? అని విజయశాంతి ప్రశ్నించారు.

కేసీఆర్ అందుకే ఆస్పత్రిపాలయ్యారు: విజయశాంతి సెటైర్లు
లవ్ జిహాద్ కొత్తగా వచ్చిందన్న విజయశాంతి.. రాష్ట్రంలో భద్రత లేక మహిళలు భయంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు. యూపీలో భద్రత లేని చోట ప్రధాని మోడీ, సీఎం యోగి భద్రత కల్పించారని విజయశాంతి చెప్పారు. ఉత్తరప్రదేశ్.. ఇప్పుడు మాఫియా చేతుల్లో లేదని, యోగి ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పారు. యూపీలో బీజేపీ వరుసగా రెండోసారి గెలిచిందంటే మంచి పనులు చేయడం వల్లేనని విజయశాంతి తెలిపారు. అపవిత్రంగా ఉన్న రాష్ట్రాన్ని యోగి ప్రభుత్వం కడిగి పవిత్రం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదన్నారు. ఇక, కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళంలోకి పోతుందన్నారు. ఉద్యోగాలు ఇస్తానని సీఎం కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ.. నాలుగు రాష్ట్రాలు గెలిచిందనే భయంతో కేసీఆర్ ఆస్పత్రిలో పడుకున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video

ప్రజలు మారాలంటూ విజయశాంతి పిలుపు..
అయితే, ముందు ప్రజలు మారాలని విజయశాంతి అన్నారు. ఇలాంటి సీఎం మనకు అవసరం లేదన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ప్రజలకు చెప్పడం తమ డ్యూటీ అన్న విజయశాంతి.. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం ప్రజల డ్యూటీ అన్నారు. రాష్ట్రంలో మార్పు అవసరమన్నారు. యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతోనే బీజేపీ గెలుపు సాధ్యమైందన్నారు. మగవాళ్లు మహిళలను గౌరవించాలని, ఇంట్లో వారినే కాదు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడాలన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విషయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications