సీఎస్ సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏల చర్చలు సఫలం: రేపట్నుంచి విధుల్లోకి
హైదరాబాద్: తెలంగాణ గత కొద్ది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్ఏలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో బుధవారం తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రేపట్నుంచి విధుల్లో చేరేందుకు వీఆర్ఏలు అంగీకరించారు.
అంతకుముందు సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో వీఆర్‌ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌ను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తెలిపారు. అలాగే పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ ప్రతినిధులు కోరారు.

సమస్యల పరిష్కారం కోరుతూ కొన్నిరోజులుగా వీఆర్‌ఏలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీఆర్ఏల డిమాండ్లపై సీఎస్‌తో చర్చించామని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. నవంబర్ 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని రవీందర్‌రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక కోడ్ దృష్ట్యా వచ్చే నెల నిర్ణయిస్తామని చెప్పారని తెలిపారు.
వీఆర్ఏలు గురువారం నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్షుడు తెలిపారు. 80 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సీఎస్ సోమేష్‌కుమార్ వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ప్రతినిధులు తెలిపారు. రేపట్నుంచి విధుల్లో చేరుతామని వీఆర్‌ఏ జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications