మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటన.. వరంగల్ కోర్టు సంచలన తీర్పు
అభంశుభం తెలియని మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అంతేకాక ఆ బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై వరంగల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. ప్రేమలతా రెడ్డి ఈ సంచలన తీర్పును వెల్లడించారు.
ఏం జరిగింది..?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన చాపర్తి సాంబయ్య అనే వృద్ధుడు.. భార్య చనిపోగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తన ఇంటి దగ్గరలో నివాసం ఉంటున్న ఓ పదకొండేళ్ల బాలికను లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. మనవరాలి వయసున్న ఆ మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఆసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చిందని వైద్యులు గుర్తించారు.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చాపర్తి సాంబయ్యను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారి మామూనూర్ ఏసీపీ తిరుపతి, అప్పటి స్టేషన్ ఇన్స్పెక్టర్ బాబూలాల్, పీపీ రవికిరణ్, భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ నీరజతో పాటు గీసుగొండ కోర్టు కానిస్టేబుల్ కు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications