వాహ్.. అబ్బురపరుస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ అందాలు!
ఒకప్పుడు రైల్వే స్టేషన్ లు ఎలా ఉండేవో మనకంతా తెలుసు.. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేస్తుంది భారతీయ రైల్వే. అమృత్ భారత్ స్టేషన్ ల పథకంలో భాగంగా ఊహించని విధంగా అభివృద్ధి చేస్తుంది. తెలంగాణా రాష్ట్రంలోనూ మొత్తం 40స్టేషన్లను అభివృద్ధి చేస్తూ జాతికి అంకితం ఇస్తుంది. ఇక ఆ క్రమంలోనే అందంగా ముస్తాబైన చారిత్రక వరంగల్ రైల్వే స్టేషన్ పై వన్ ఇండియా స్పెషల్ స్టోరీ
అధునాతనంగా వరంగల్ రైల్వేస్టేషన్
వరంగల్ రైల్వేస్టేషన్.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ లో అభివృద్ధి చేయబడింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా 25.41కోట్ల నిధులతో నిర్మించిన అధునాతన వరంగల్ రైల్వే స్టేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ రైల్వేస్టేషన్ ఎటు చూసినా అధునాతనంగా తయారైంది.

కాకతీయ వైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణం
దాదాపు 6వేల కోట్లతో దేశవ్యాప్తంగా 1200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించి చేస్తున్న అమృత్ స్టేషన్ల పథకంలో భాగంగా వైభవాన్ని సంతరించుకుంది వరంగల్ రైల్వే స్టేషన్. ఇది నిత్యం ఇక్కడ రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనతో పాటు, ఆహ్లాదాన్ని పంచుతుంది. కాకతీయుల వైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేశారు.
కాకతీయ కళాతోరణం శైలిలో ఎంట్రన్స్
రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత అంతటి కీలకమైన వరంగల్ రైల్వే స్టేషన్ కేరళ, తమిళనాడు, ఏపీ నుండి ఢిల్లీకి వెళ్లే రైళ్లతో ఉత్తర, దక్షిణ భారతదేశాల కూడలిగా ఉంది. కాకతీయుల చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా ఈ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని కాకతీయ కళాతోరణం శైలిలో నిర్మించారు. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో స్తంభాలపై అద్భుతంగా ఏనుగుల శిల్పాలను తీర్చిదిద్దారు.
వరంగల్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి ఇలా
12 మీటర్ల వెడల్పుతో, మూడు లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు, అతి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. అంతేకాదు దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం వారు ఈజీగా నడవడం కోసం ప్రత్యేకంగా రాంప్ లను నిర్మించారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం మొత్తం ఎల్ఈడి లైట్ల వెలుగులతో, ఎటు చూసినా డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ఏది ఎక్కడ ఉందో ప్రయాణికులకు అర్థమయ్యేలా చూపించే సైన్ బోర్డులతో ఆధునికత ఉట్టిపడేలా నిర్మాణం చేశారు.
అన్ని వసతులతో నిర్మాణం
ప్రయాణికులు వేచి ఉండడానికి ఆధునిక ఫర్నిచర్ తో విశాలమైన వెయిటింగ్ హాల్స్ ను నిర్మించారు. మెరుగైన పార్కింగ్ సౌకర్యాన్ని, పరిశుభ్రమైన టాయిలెట్స్ నిర్మాణం చేశారు. రైల్వే స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల నిమిత్తం ప్రత్యేక భవనాలను నిర్మించారు. ప్రతి ప్లాట్ఫామ్ పైన రేకులతో పైకప్పు వేశారు.రైల్వే స్టేషన్ గోడలపైన అద్భుతమైన కళాకృతులను చిత్రీకరించారు. మన భారతీయ గ్రామీణ జీవన సౌందర్యాన్ని తెలియజేసేలా అనేక చిత్రాలను గోడలపైన చిత్రీకరించి రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని సుందరీకరించారు.
అందం, ఆహ్లాదం, సౌకర్యం.. వీటికే పెద్ద పీట
అన్ని ప్లాట్ ఫామ్ ల పైన గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు. ఎటు చూసినా అందం, ఆహ్లాదం, సౌకర్యం ఈ మూడింటికి పెద్దపీట వేసి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేశారు. దాదాపు సంవత్సర కాలం ఎంతో కష్టపడి వరంగల్ రైల్వే స్టేషన్ ను చక్కగా పునర్నిర్మాణం పూర్తి చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ నిత్యం 31 వేల పై చిలుకు ప్రయాణికులతో 130రైళ్ళ రాకపోకలతో దక్షిణ మధ్య రైల్వేకు మంచి ఆదాయ వనరుగా ఉంది.
రైల్వే స్టేషన్ లో సెల్ఫీ పాయింట్
ఈ రైల్వే స్టేషన్ సంవత్సరానికి సుమారు 41 కోట్లకు పైగా ఆదాయం రైల్వేకు అందిస్తుంది. ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్ చూపరులను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ, అందరూ అబ్బుర పడేలా చేస్తుంది. ఒకప్పుడు రైల్వే స్టేషన్ కు రావాలంటే చిరాకు పడినవారు, ఇప్పుడు రైల్వే స్టేషన్ కు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రైల్వే స్టేషన్ బయట ఐ లవ్ వరంగల్ అంటూ ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.
ఎయిర్ పోర్ట్ తరహాలో వరంగల్ రైల్వే స్టేషన్
పగలు ప్రశాంతంగా, ఠీవిగా కనిపిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్, రాత్రి ఎల్ఈడి వెలుగులలో దర్పంగా, కాకతీయుల వైభవానికి ప్రతీకగా కనబడుతుంది. ఓరుగల్లుకు వచ్చిన వారంతా ఇంత అందంగా ఉన్న రైల్వే స్టేషన్ ను చూసి ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దారని కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చేస్తున్న కృషిని తెగ మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications