ఒక్క వర్షానికే వణికిన వరంగల్.. వరదనీళ్ళలో చిక్కుకున్న రెండు ఆర్టీసీబస్సులు, ప్రయాణికుల భయాందోళన!
వరంగల్ జిల్లాలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హన్మకొండలోని బస్టాండ్, చౌరస్తాలో చెరువులను తలపిస్తున్నాయి. కొద్దిసేపు కురిసిన భారీ వర్షానికి వరంగల్ లోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి.
అండర్ బ్రిడ్జ్ క్రింద నిలిచిపోయిన బస్సులు.. కాపాడిన పోలీసులు
వరంగల్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అండర్ బ్రిడ్జ్ క్రింది నుండి వెళ్లవలసిన బస్సులు రెండు నీళ్లలో నిలిచిపోయాయి. పీకల లోతు నీళ్లు అండర్ బ్రిడ్జి కిందకు చేరుకోవడంతో బస్సులో ప్రయాణికులు భయాందోళన చెందారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వరద నీటిలో నిలిచిపోయిన బస్సుల నుండి ప్రయాణికులను తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చారు.

తాళ్ళ సహాయంతో సురక్షితంగా బయటకు వచ్చిన ప్రయాణికులు
ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు మొత్తం పట్ల తీసుకురావడం పట్ల ప్రయాణికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సులు వర్షం నీళ్ళలో నిలిచిపోయిన సమయానికి బస్సులో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. వారంతా పోలీసులు వారిని బయటకు తీసుకురావటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క వర్షానికే మునుగుతున్న అండర్ బ్రిడ్జ్
ఒక్క వర్షానికే వరంగల్ అండర్ బ్రిడ్జి నీళ్లలో మునిగిపోతుందని, నగరం నడిబొడ్డున అండర్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి ఉంటే వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని, ఒక్కోసారి ఆ మార్గంలో వాహన రాకపోకలు ఎక్కడికి అక్కడే నిలిచి పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడితే చాలు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని వారు అంటున్నారు.
వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో
ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, వరంగల్ అండర్ బ్రిడ్జి వరద సమస్యను ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అండర్ బ్రిడ్జ్ పైన రైల్వే లైన్ ఉన్న కారణంగా దీని విషయంలో ఎలాంటి చర్య చేపట్టాలన్నా రైల్వే అనుమతి కావాల్సిందే. అండర్ బ్రిడ్జ్ క్రింద రోడ్డు ఎట్టు పెంచే అవకాశం లేదు. ఇక నీళ్ళను ఆగకుండా మళ్ళించటానికి ప్రత్యామ్నాయం చూడాల్సిందే.












Click it and Unblock the Notifications