6నే ముహూర్తం: ఎందుకు డిఎస్ కారెక్కుతున్నారు?
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత చాలా కాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన బిజెపి నాయకత్వం డిఎస్‌కు ఆహ్వానం పలికినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు కూడా ఆయన సంప్రదించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన టిఆర్ఎస్‌లో చేరాలని అనుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 6వ తేదీ నిజామాబాద్ జిల్లాలో కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు గానీ రాజ్యసభ సీటు గానీ దక్కవచ్చునని ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని నేరుగా కలవగలిగే నాయకుల్లో డిఎస్ ఒక్కరు. అయినప్పటికీ ఆయన క్రమంగా కాంగ్రెసు కార్యకరలాపాలకు దూరమవుతూ వచ్చారు.

డిఎస్ 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, డీఎస్‌కు పదవి దక్కలేదు. వైఎస్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు 2011లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి ప్రచారంలో ఉన్న వారిలో డీఎస్ కూడా ఉన్నారు. అయితే, టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెసు ఆశలు అడుగంటాయి.
దాంతో డీఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసే వరకు శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. అయితే ఆయన తన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించటంతో డీఎస్‌కు నిరాశ తప్పలేదు. ఆకుల లలితకు డీఎస్సే పార్టీ టికెట్ ఇప్పించారనే ప్రచారం జరిగింది. కనీసం తనను సంప్రదించకుండానే ఆకుల లలిత పేరును ఖరారు చేయడం పట్ల ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
దిగ్విజయ్‌సింగ్‌తోపాటు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా డిఎస్‌ను పట్టించుకోవడం మానేశారు. ఇటీవల రాహుల్‌గాంధీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తగిన ప్రాధాన్యం దక్కలేదు. జాతీయ స్థాయిలో కూడా పార్టీలో డిఎస్‌కు స్థానం లభించకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications