వింగ్స్ ఇండియా 2022: నాలుగేళ్ల తర్వాత భాగ్యనగర్ వేదికగా ఏవియేషన్ షో; ఎప్పటినుండి అంటే
హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. భాగ్యనగరం వేదికగా ఎయిర్ షో నిర్వహించటానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాఫ్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగర వాసులకు కనువిందు చేయనున్నాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతూ చూపరులను ఆకట్టుకోనున్నాయి. ఈనెల 24వ తేదీ నుంచి వింగ్స్ ఇండియా 2022 పేరుతో హైదరాబాద్ వేదికగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఈ విమానాల పండుగకు బేగంపేట ఎయిర్ పోర్టు ముస్తాబు కానుంది. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా నాలుగు ఏళ్ళ విరామం తర్వాత ఈ ఎయిర్ షో ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎప్పుడెప్పుడా అని వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఎయిర్ షో నాలుగు రోజుల పాటు సాగనుంది. బేగంపేట ఎయిర్పోర్టులో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. అదే విధంగా ఆరు వేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ విమానాల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకునేవారు వింగ్స్ఇండియా వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నాలుగేళ్ల తర్వాత ఈ ఏవియేషన్ షో ఘనంగా నిర్వహించటం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి మూడు రోజులు ప్రముఖులు, వ్యాపారవేత్తలను ఏవియేషన్ షో కు అనుమతిస్తారు. చివరి రోజు సాధారణ సందర్శకులు 500 రూపాయలను చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు. మార్చి 24 వ తేదీ నుండి మార్చి 27వ తేదీ వరకు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. మరెందుకాలస్యం ఈ విమానాల పండుగను చూడటానికి సిద్ధమైపొండి.












Click it and Unblock the Notifications