వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన ఇల వైకుంఠపురం!
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన, ఇల వైకుంఠంగా గుర్తింపు పొందిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసింది. రేపు ఉదయం 5:15 నిమిషాలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా రేపు నిత్య కైంకర్యాలలో కూడా మార్పులు ఉంటాయి.
ముక్కోటి ఏకాదశి .. యాదాద్రీశుని ఉత్తర ద్వారదర్శనం
రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన కైంకర్యంతో పాటు, ఆర్జిత నిజాభిషేకం సహస్రనామార్చన రద్దుపరిచినట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గరుడ వాహనం పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఉత్తర ద్వారం ద్వారా గరుడ వాహనంపై భక్తులకు దర్శనాన్ని ఇచ్చే స్వామివారిని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా వెల్లడించారు.

వైకుంఠ ఏకాదశి నాడు యాదగిరి గుట్ట ఆలయంలో సేవలు ఇలా
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రేపు ఉదయం 2 గంటలకు ఆలయాన్ని తెరిచి 2గంటల నుండి 2.30 నిమిషాల వరకు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2.30 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రాతఃకాల తిరువారాధనను నిర్వహిస్తారు. 3 గంటల నుంచి 3.30 నిమిషాల వరకు తిరుప్పావై సేవాకాలంగా పేర్కొన్నారు. ఆపై 3.30 నిమిషాల నుండి 4.15 నిమిషాల వరకు బాల భోగం ఆరగింపు నిర్వహిస్తారు.
ఉత్తర ద్వార దర్శన భాగ్య సమయం ఇదే
అనంతరం 4.15 నిమిషాల నుండి 5:15 నిమిషాల వరకు స్వామివారికి అలంకారాన్ని నిర్వహిస్తారు. ఆపై 5.30 నిమిషాల నుండి 6:30 వరకు ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తారు చతుర్వేద వేద పారాయణాలతో మంగళ వాయిద్యాలతో వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఉపన్యసిస్తారు. అనంతరం 6.30 నిమిషాల నుండి 7.40 తిరువీధి సేవ చేస్తారు. ఆపై ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు అధ్యయనోత్సవ పురవీధి సేవ నిర్వహిస్తారు.
సర్వ దర్శనాలు అప్పుడే
ఇక ఉదయం 8 గంటల నుండి 12.30 నిమిషాల వరకు సర్వదర్శనాలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుండి 12:00 వరకు స్వామివారికి అధ్యయనోత్సవ తిరుమంజన స్నపనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 నుండి 1: 30 నిమిషాల వరకు మధ్యాహ్న రాజభోగం నిర్వహిస్తారు. ఆపై మధ్యాహ్నం 1.30 నిమిషాల నుండి యధావిధిగా నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు.
రేపటి నుండి అధ్యయనోత్సవాలు
ఇక రేపటి నుంచి యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతున్న కారణంగా రేపటి నుంచి 15వ తేదీ వరకు ఆరు రోజులపాటు భక్తులతో జరిపించే శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని, నిత్య శాశ్వత కళ్యాణాన్ని, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలను, జోడు సేవలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications