చేతబడి అనుమానంతో యువకుడిని ఏం చేశారో తెలుసా..!
మూఢనమ్మకాల ముసుగులో మానవత్వం మంట గలిసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడిని కొట్టి చంపిన ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అళ్లపల్లి మండలం బస్తాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఘటన ఎలా జరిగింది?
ఈనెల 6వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చెందిన మడకం బీడ రాజు (35)పై కొందరు గ్రామస్తులు దారుణంగా దాడి చేశారు. రెండు రోజుల క్రితం గ్రామంలో పదో తరగతి చదువుతున్న గంగి అనే విద్యార్థిని కామెర్లతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యపరమైన కారణాలను పక్కనబెట్టి, కొందరు గ్రామస్తులు "రాజు చేతబడి చేశాడు" అనే అనుమానం పెంచుకున్నారు.

బాలిక బంధువులలో ఏడుగురు వ్యక్తులు.. ఎలాంటి సాక్ష్యం లేకుండా, రాజును పట్టుకుని చెట్టుకు కట్టేసి, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. "చేతబడి ఎందుకు చేశావు?" అని అడుగుతూ.. చితకబాదడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని బుసురాయి గుట్టలలో పడవేశారు.
కాగా సమాచారం అందుకున్న టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ, అళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలోని స్పెషల్ పోలీస్ పార్టీ, డీఎస్పీ చంద్రబాను పర్యవేక్షణలో ఘటనా స్థలానికి చేరుకుంది. అడవులు, గుట్టల మధ్య ఆరు కిలోమీటర్ల దూరం నడిచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మూఢనమ్మకాలు, చేతబడి పేరుతో హత్యలు, దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వం, విజ్ఞాన వేదికలు, స్వచ్ఛంద సంస్థలు సంవత్సరాలుగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల మూఢనమ్మకాల పట్టు ఇంకా ఇలానే కొనసాగుతున్నాయని తెలుస్తోంది. రాజుపై దాడి చేసిన ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications