చెల్లిని ఉద్దేశించి ‘సారీ బుజ్జి’: ఖమ్మం జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: ‘‘ఏడుస్తూ పుట్టిన నేను.. ఏడుస్తూ బతకలేక చస్తున్నా'నంటూ ఆత్మహత్య చేసుకున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగ యువకుడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామానికి చెందిన పాపగంటి రాధాకృష్ణ (25) ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) పూర్తిచేశాడు.
గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి, చివరకు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద చదువు చదివినా రెండేళ్ల నుంచి ఉద్యోగం లేకపోయిందని తరచూ వాపోతుండేవాడని అతడి స్నేహితులు అంటున్నారు.
తను జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయని రాధాకృష్ణ సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మనిషి బతకడానికి ఇంత కష్టపడాలా'' అని రాశాడు. ‘నేను చస్తున్నా ఏడుస్తూ పుట్టిన నేను ఏడుస్తూ బతకలేక చుస్తున్నా' అని రాసుకున్నాడు. తన చెల్లిని ఉద్దేశించి ‘సారీ బుజ్జి' అని చివరి మాటలుగా రాశాడు.

ఇక రాధాకృష్ణ తల్లిదండ్రులు వెంకటరమణ, వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీలు. వారికున్న ఎకరం పొలం పండించుకొంటూ రాధాకృష్ణను చదివించుకున్నారు. కాగా బుధవారం రాత్రి రాధాకృష్ణ తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి ఇంటిముందు వసారాలో పడుకొన్నారు. గురువారం ఉదయం వారు లేచి చూసేసరికి అతడు ఉరివేసుకొని చనిపోవడంతో షాక్‌తిన్నారు.
రాత్రి పొద్దుపోయే వరకూ టీవి చూశాడని.. ఎప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాడోనని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆలస్యంగానైనా మంచి ఉద్యోగం సాధిస్తానని కొడుకు అంటుండేవాడని, చివరకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు.












Click it and Unblock the Notifications