వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తోన్నాడు..!!
తిరుపతి: కొత్త సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకుంటోన్నారు. దీనితో అన్ని కంపార్ట్‌మెంట్స్ భర్తీ అయ్యాయి. స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. మంగళవారం నాడు 70,496 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,500 మంది తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి సేవలో సజ్జల..
శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. 5.88 కోట్ల రూపాయలుగా నమోదైంది. అటు వీఐపీల తాకిడి కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అప్రతిహతంగా..
దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపం వద్ద అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. దర్శనాన్ని ముగించుకుని వెలుపలకు వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణా రెడ్డి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ మహాయజ్ఞం చేస్తోన్నారని, అది అప్రతిహతంగా కొనసాగాలని దేవదేవుడిని ప్రార్థించానని అన్నారు.

ఎప్పుడైనా విశాఖ..
మూడు రాజధానుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఎప్పుడైనా ఏర్పాటు కావొచ్చని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయాన్ని తరలించడానికి ఏర్పాట్లు సాగిస్తున్నామని పేర్కొన్నారు. మొన్నటివరకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని, ఇప్పుడు అలాంటి అడ్డంకులు ఒక్కటొక్కటిగా తొలగిపోతోన్నాయని వ్యాఖ్యానించారు.

అభివృద్ధిలో భాగమే..
ఇప్పుడున్న రాజధాని అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలను తీసుకుంటోన్నారని, ఇందులో భాగమే మూడు రాజధానుల ఏర్పాటు అని పేర్కొన్నారాయన.

మహాయజ్ఞంలా..
జగన్ సారథ్యంలో రాష్ట్ర పరిపాలన ఒక మహాయజ్ఞంలా సాగుతోందని సజ్జల అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని జగన్ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోన్నారని పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ చేసిన అప్పు చాలా తక్కువేనంటూ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్ లో వివరించిందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందంటూ కొన్ని సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు.

విషశక్తులు..మారీచులు
దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, దేశానికే రోల్ మోడల్‌గా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందని అన్నారు. దీన్ని చూసి ఓర్వలేక కొన్ని విషశక్తులు, మారీచులు జగన్ చేస్తోన్న యజ్ఞాన్ని భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అవన్నీ తొలగిపోవాలని, జగన్ కు లభిస్తోన్న ప్రజాదరణ వెయ్యింతలు పెరగాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు.












Click it and Unblock the Notifications