TTD: రూ 300 టికెట్ల కోటా పెంపు - భక్తులకు సంతృప్తికర దర్శనం, కీలక నిర్ణయాలు..!!
Tirumala: ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యాక్రమాలు జరగనున్నాయి. సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. ఈ రోజు బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. మలయప్ప స్వామివారు గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తులు సంతృప్తికరంగా దర్శనం పై కీలక నిర్ణయం ప్రకటించారు.
నేడు ఆణివార ఆస్థానం:తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు (జూలై 17వ తేదీ)న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లోనూ నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు.

ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
భక్తులకు కనువిందు:ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
అదనంగా నాలుగు వేల టికెట్లు:శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు రూ.880 కోట్లు విరాళాలు అందగా, ఈ నిధులతో దాదాపు 2,500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు మూడు నెలల ముందుగా రూ.300/- దర్శన టికెట్లు విడుదల చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి 4 వేల రూ.300/- దర్శన టికెట్లు టికెట్లు అదనంగా విడుదల చేస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవకుల కోసం వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రత్యేక హాలు కేటాయించి అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సేవాసదనంలో అన్న ప్రసాదాలు అందించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేలా మహద్వారం నుంచి గర్భాలయం వరకు ఒకే వరుస విధానాన్ని అమలు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications