TTD: నేరుగా శ్రీవారి దర్శనం, నో వెయిటింగ్ - గరుడ వాహనంపై దేవదేవుడు..!!
Tirumala: తిరుమలలో రద్దీ తగ్గింది. నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు గరుడ పంచమి కావటంతో శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. దివ్య దర్శనంలో ఇచ్చిన వెసులుబాటుతో రోడ్డు మార్గంలో భక్తులు తిరుమల చేరుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం, వసతి టోకెన్లును టీటీడీ విడుదల చేస్తోంది.
తగ్గిన రద్దీ..నేరుగా దర్శనం
తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం శ్రీవారిని 79,444 మంది దర్శించుకున్నారు. 28,744 మంది తల నీలాలు సమర్పించారు. రూ 4.21 కోట్ల ఆదాయం సమకూరింది. రద్దీ బాగా తగ్గటంతో కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక, ఈ రోజు తిరుమలలో గరుడ పంచమి పర్వదినం నిర్వహిస్తున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.

తిరుమలలో గరుడ పంచమి
ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఇక, శ్రీవారి సేవలు, దర్శనం కు సంబంధించిన టోకెన్ల విడుదలకు టీటీడీ నిర్ణీత తేదీలను ఖరారు చేసింది. అందులో భాగంగా నవంబర్ కు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

దర్శనం, వసతి టోకెన్లు విడుదల
ఇక, నవంబర్ మాసానికి సంబంధించిన ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. టోకెన్లు పొందే భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.












Click it and Unblock the Notifications