తిరుమలలో భారీ అగ్నిప్రమాదం: శ్రీవారి ఆస్థానమండపం సమీపంలో
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరారు. మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడం వల్ల పెను నష్టం తప్పినట్టయింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న దుకాణ సముదాయాల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. వంద దుకాణాలు ఉన్న సముదాయం ఇది. శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉంటుంది. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులు ఏవైనా వస్తువులను కొనాలంటే- ఈ సముదాయాలకే వెళ్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా భక్తులు తిరుమలకు వస్తుండటం చాలాకాలం నుంచీ దుకాణాలు బోసిపోయాయి.

ఈ ఉదయం ఈ షాపుల్లో మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే భగ్గుమంటూ అగ్నికీలలు వ్యాపించాయి. దుకాణ సముదాయాలను చుట్టుముట్టాయి. దీన్ని గమనించిన టీటీడీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడం వల్ల పెను నష్టం తప్పినట్టయింది.
Recommended Video
మంటలు మరింత విస్తరించి ఉంటే వంద దుకాణాలు అగ్నికి అహూతి అయ్యేవి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్ని కీలలను నియంత్రించడంతో ఆరు దుకాణాలు మాత్రమే పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా తెలియ రావాల్సి ఉంది. భక్తుల రాక తగ్గడం వల్ల ఇప్పటికే వ్యాపారాలు లేక దుకాణదారులు ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఈ పరిస్థితుల్లో అగ్నిప్రమాదం సంభవించడం ఆర్థికంగా వారిని మరింత ఇక్కట్లలోకి నెట్టినట్టయింది.












Click it and Unblock the Notifications