TTD: రెండు నెలల రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల..!!
Tirmuala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా ఈ నెల 24న రెండు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది. దీంతో పాటుగా తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సమయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ: తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 81,833 మంది భక్తులు దర్శించుకోగా 33,860 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, జూలై, ఆగస్టు నెలలకు చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

దర్శనం టోకెన్లు విడుదల: శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయడం జరుగుతుందుని అధికారులు వెల్లడించారు. తిరుమలలో రద్దీ పెరుగుతున్న వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు శుక్రవారం వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను నిలిపివేసిన టీటీడీ ఇక నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించకూడదని నిర్ణయించింది. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీఐపీ దర్శనాలకు బ్రేక్: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఈ సమయం సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం శీఘ్రంగా అందేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాలు..సమయం ఆదా ద్వారా సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షంచకుండా చేసేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications