హైదరాబాద్- విజయవాడ హైవే క్లోజ్: ఈ మార్గంలో వాహనాల మళ్లింపు: పోలీసుల ప్రకటన
విజయవాడ: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న అతి భారీ వర్షాల వల్ల మున్నేరు వాగు ఉరకలెత్తుతోంది. వరద నీటితో పోటెత్తుతోంది. వరద నీరు జాతీయ రహదారిపైకి చేరుకుంది. దీనితో హైదరాబాద్-విజయవాడ మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించారు.
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల మున్నేరు వాగు వరద పోటుకు గురైంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో నందిగామ మండలం కీసర గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ మార్గాన్ని మూసివేశారు.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనదారులు.. నార్కట్‌పల్లి-మిర్యాలగూడ-దాచేపల్లి-పిడుగురాళ్ల-సత్తెనపల్లి-గుంటూరు-విజయవాడ-ఏలూరు-రాజమండ్రి మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వారు.. రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-గుంటూరు-సత్తెనపల్లి-పిడుగురాళ్ల- దాచేపల్లి- మిర్యాలగూడ- నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
వాహనాలు మున్నేరు వాగును దాటుకుని విజయవాడ వైపు రాకుండా నిలువరించారు. రోడ్డుకు అడ్డంగా పోలీసులు తమ వాహనాలను అడ్డుగా పెట్టారు. ఏదైనా ఇతర సమాచారం కోసం విజయవాడ నగర పోలీస్ కంట్రోల్ రూమ్ 7328909090 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. మున్నేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోండటంతో అటువైపు వెళ్లొద్దంటూ ఆదేశించారు.

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేశారు పోలీసులు. నందిగామ మండలం ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను అక్కడే ఆపివేశారు. వరద ప్రభావ ప్రాంతాలు, హైదరాబాద్ - విజయవాడ హైవేపై వరద పరిస్థితులను, ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ విశాల్ గున్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications