వైఎస్ జగన్! ఇదేనా మీ దసరా కానుక?: ఏపీ సర్కారును కడిగిపారేసిన పవన్ కళ్యాణ్
అమరావతి: 'క్షమించాలి.. మూసేశాం విద్యుత్ లేదు' లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సెటైర్లు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి.. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే అలుముకుంటున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. విద్యుత్ కోతలను ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? అంటూ జగన్ సర్కారును నిలదీశారు.

జగన్ సర్కారు విఫలం..
‘ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది' అని పవన్ విమర్శించారు.

ఇదే దసరా కానుకా?
‘ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?' అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

ఎందుకు ప్రజలను చీకట్లోకి నెట్టారు?
‘2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు' అని పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు.

ఎందుకిలా జరుగుతోంది?
‘ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే' అని పవన్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఆలోచనలుంటే..
‘ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు; కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్లని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం.. మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?' అంటూ వైఎస్ జగన్ సర్కారును కడిగేశారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications