కాపులను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా పవన్: కమ్మ వాళ్లు సీట్లు త్యాగాలు చేయకూడదా
Pothina Mahesh: ఊహించినట్టే- విజయవాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు పోతిన మహేష్.. పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తూ వస్తోన్నారాయన. ఈ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. 2019లోనూ ఆయన ఇదే స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.
పొత్తులో భాగంగా ఈ సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పోతిన మహేష్.. జనసేనకు రాజీనామా చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు.

సినిమాల్లో నటించే పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో కూడా నటుడిగానే మిగిలిపోతాడని పోతిన మహేష్ విమర్శించారు. ప్రజలకు, తనను నమ్మిన వారికి నేనున్నాననే భరోసా కల్పించేవాడే రాజకీయ నాయకుడవుతాడని, అలాంటి లక్షణాలు ఏవీ పవన్ కల్యాణ్‌లో లేవని మండిపడ్డారు.
తన తల్లిని తిట్టాడంటూ గతంలో ఇదే పవన్ కల్యాణ్.. సుజనా చౌదరికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టాడని, ఇప్పుడు అదే పవన్ కల్యాణ్.. సుజనా చౌదరికి ఎలా మద్దతు ఇస్తోన్నాడని నిలదీశారు. పవన్ కల్యాణ్‌ను నమ్మి తామందరం రాజకీయాల్లోకి వచ్చామని, మార్పును ఆశించామని దీనికి భిన్నంగా ఆయన ప్రవర్తిస్తోన్నారని ధ్వజమెత్తారు.
తమ పార్టీకి టీడీపీ కుక్క బిస్కెట్లు వేసినట్టు 15-20 సీట్లు ఇస్తే అవి తీసుకోవాలా? అంటూ బహిరంగంగా విమర్శించిన పవన్ కల్యాణ్ .. ఇప్పుడు అవే సీట్లు, బిస్కెట్లకు లొంగిపోయాడని పోతిన మహేష్ అన్నారు. ఏ బిస్కెట్లు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పొత్తులో భాగంగా బీజేపీ.. టీడీపీకి సీట్లు అడిగితే- జనసేన ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందని పోతిన మహేష్ ప్రశ్నించారు. ఏ కుక్క బిస్కెట్లు ఇక్కడ పని చేశాయో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని అన్నారు. విజయవాడ వంటి రాజధాని ప్రాంతంలో తాము ఇన్నాళ్లూ జనసేన పార్టీని బతికించామని, దీనికి ప్రతిఫలంగా పవన్ కల్యాణ్ తమను చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారాయన.
జనసేన పార్టీ లేదు, దానికి జెండా లేదు, గాజు గ్లాసు గుర్తూ లేదు, అసలు జనసైనికులను పట్టించుకునే నాథుడే లేడంటూ పోతిన మహేష్ చెప్పారు. జనసేన పార్టీ దేనికోసం పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలతో పాటు 40 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు కోరుకుంటోన్నారని అన్నారు.
కాపు నాయకుడే.. కాపుల సామాజికవర్గం గొంతు నొక్కుతున్నాడని పోతిన మహేష్ మండిపడ్డారు. కాపులందరూ పవన్‌కు కాపు కాస్తే ఆయన వాళ్లందరినీ బలి పశువులను చేశాడని, ఇప్పటికైనా తమ గొంతు కోయడం ఆపాలని కన్నీటితో అభ్యర్థిస్తున్నానని అన్నారు. 21 సీట్లతో పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రజలకు ఏం భవిష్యత్ ఇస్తాడని, ఆ నమ్మకం ఆయనక్కూడా లేదని చెప్పారు. కాపులే సీట్లను త్యాగాలు చేయాలా? కమ్మ వాళ్లు చేయకూడదా? అంటూ నిలదీశారాయన.
ఎవరైనా రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడానికి వస్తారు అంతే గానీ ఎవరో వేసే బిస్కెట్లకు కాదని పోతిన మహేష్ హితవు పలికారు. ఇలాంటి రాజకీయ నాయకుడి పార్టీలో తాము ఇన్నాళ్లూ ఉన్నామా? ఈ పార్టీని బతికించుకోవడానికి కష్టపడ్డామా? అని తలచుకుంటే ఇప్పుడు సిగ్గేస్తోందని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడని ఆయన కాపు సామాజిక వర్గానికి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications