జగన్ పథకానికి బెజవాడ టీడీపీ నేత ప్రశంసలు- ఇళ్లపట్టాలు అపూర్వఘట్టమంటూ పోస్టర్లు
విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపే టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు తాజాగా మరో సంచలనానికి కారణమయ్యారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం, ప్రతీ పథకాన్ని విమర్శిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా నిత్యం యుద్ధం చేస్తున్న సమయంలో కాట్రగడ్డ బాబు నగరంలో వేయించిన తాజా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
విజయవాడ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కాట్రగడ్డ బాబు గతంలో తన పోస్టర్లతో పలుమార్లు సంచలనాలు రేపారు. తాజాగా ఆయన ఏకంగా తన పార్టీ విధానానికి వ్యతిరేకంగా సీఎం జగన్‌కు మద్దతిస్తూ పోస్టర్లు వేయించారు. రేపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పొగుడుతూ కాట్రగడ్డ బాబు వేయించిన పోస్టర్లు ఇప్పుడు విజయవాడ నగరంలోనే కాదు టీడీపీలో సైతం కలకలం రేపుతున్నాయి. నగరంలో ఈ పోస్టర్లపై ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది.

రేపు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కాకినాడలో ప్రారంభిస్తున్న సందర్భంగా కాట్రగడ్డ బాబు.. ఒకే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయడం, 15 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వ ఘట్టమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఆనంద శుభవేళ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గారికి అభినందనలు అంటూ కాట్రగడ్డ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర యజ్ఞం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఈ పోస్టర్లలోనే కాట్రగడ్డ బాబు జగన్ సర్కారుకు మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం ఇళ్ల స్ధలాలతో పాటు అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల విషయంలో మాత్రం పునఃపరిశీలించాలని బాబు కోరారు. సీఎం గారూ 3 రాజధానుల నిర్ణయం దయచేసి పునఃపరిశీలించండి అంటూ కాట్రగడ్డ బాబు పోస్టర్లలో కోరారు. దీనికి కూడా బలమైన కారణముంది. ప్రస్తుతం బెజవాడతో పాటు అమరావతి ప్రాంతంలోనూ మూడు రాజధానుల ఉద్యమం నడుస్తోంది. అలాగే మద్దతు కూడా పెరుగుతోంది. ఈ సమయంలో ఇళ్ల పట్టాల ను పొగిడి రాజధానుల విషయం ప్రస్తావించకపోతే విమర్శలు తప్పవనే ఉద్దేశంతో అలా రాయించినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications