అనాథ పిల్లలతో జగన్ దంపతులు: ఆప్యాయంగా పలకరింపు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకొంటోన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తోన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. బైక్ ర్యాలీలను ఏర్పాటు చేశారు.

విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవనాన్ని వైఎస్ జగన్ దంపతులు ప్రారంభించారు. అక్కడి మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్మల్ హృదయ్ భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముఖ్యమంత్రి దంపతులు ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగారు. నిర్మల్ హృదయ్ భవన్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని ప్రారంభించారు.

నిర్మల్ హృదయ్ భవన్‌లో నివసించే అనాథ పిల్లలతో రిబ్బన్ కట్ చేయించారు జగన్. శిలాఫలకాన్ని కూడా వారితోనే ఆవిష్కరింపజేశారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయన నేరుగా రాఘవయ్య పార్క్ వద్దకు చేరుకున్నారు. నిర్మల్ హృదయ్‌భవన్‌కు వెళ్లారు. నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నిర్మల్ హృదయ్‌భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముఖ్యమంత్రి దంపతులు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అనంతరం అనాథ పిల్లలు, వృద్ధులతో ఫొటోలు దిగారు. నిద్రపోతున్న ఓ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని జగన్ ఆప్యాయంగా ముద్దాడటం ఆకట్టుకుంది. అక్కడ ఉన్నంతసేపు పిల్లలతో సరదాగా గడిపారు జగన్ దంపతులు.












Click it and Unblock the Notifications