రైతులపై వాలంటీర్ల పెత్తనం-పట్టా పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు ? బొబ్బిలిలో చంద్రబాబు
బొబ్బిలిలో ఇదేం ఖర్మ రైతులకు పేరుతో టీడీపీ నిర్వహించిన రైతు సదస్సులో అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.
రైతుల పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల భూములు జగన్ జాగీరువి కావని, జగన్ ఓ సైకో.. సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.జగన్‍ను ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపిస్తారన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులు చేపట్టామని, పోలవరాన్ని జగన్ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందన్నారు. తాము అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేశామని, పాత వ్యవస్థలను ఎప్పుడూ రద్దు చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు.
వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా? అని చంద్రబాబు బొబ్బిలిలో ప్రశ్నించారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని,
రైతులకు గిట్టుబాటు ధరలు దక్కాయా? అని చంద్రబాబు అడిగారు. సింగిల్ విండో విధానం ద్వారా రైతులకు కావాల్సినవి ఇచ్చామని, డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేశామని గుర్తుచేశారు. భారతదేశానికి తిండి పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని ఆయన పేర్కొన్నారు. ధరలు రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు.రైతుల పంటకు మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామని, రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామన్నారు.

జగన్ మీటింగ్‍లకు రాకపొతే పెన్షన్ కట్.. రేషన్ కట్.. చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‍కే అధికారాన్ని కట్ చేసే రోజు వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరికి అప్పులు, వేధింపులే మిగిలాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అప్పుల్లో ఏపీ నెంబర్ వన్.. ఆత్మహత్యల్లో నెంబర్ వన్.. ఇది జగన్‍మోహన్ రెడ్డి సాధించిన విజయమన్నారు. మోటర్లకు ఇప్పుడు జగన్ మీటర్లు పెడుతున్నాడని, ఎక్కడికక్కడ సైకో బ్యాచ్ తయారైందన్నారు.

జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు పతనావస్థలోకి వచ్చాయని చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనపై అందరూ ఆగ్రహంతో ఉన్నారని, బొబ్బిలి కోట అదిరిపోయింది.. జనమంతా రోడ్లపైకి వచ్చారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications