రాజీనామాల పై తెలంగాణా ఎన్నారై సంఘం హర్షం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ఎన్నారై సంఘం ఆహ్వానించింది. కాంగ్రెస్ మోసానికి నిరసనగా రాజీనామా చేసిన ప్రజాప్రతినిధుల త్యాగాలను తాము కొనియాడుతున్నట్లు సంఘం చైర్మన్ రవి మేరెడ్డి, కన్వీనర్ హరి మారోజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాస ప్రజాప్రతినిధులు నిబద్ధతతో, అంకితభావంతో పని చేస్తున్నారని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో వారి త్యాగాల చరిత్ర నిలిచిపోతుందని వారన్నారు.
తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని మన్నించని కాంగ్రెస్ వైఖరిని వారు ఖండించారు. తెలంగాణ ఉద్యమం వల్ల, తెరాసతో పొత్తు వల్ల అధికారంలోకి వచ్చామనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలని వారు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని బలపరుస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజలు కాంగ్రెసుకు ఓటేశారని వారన్నారు. నాలుగేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ మోసం చేసిందని వారు విమర్శించారు.
తెలంగాణ అంశంపై పార్టీ అధిష్ఠాన వర్గం మౌనాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తుండడాన్ని వారు ఆహ్వానించారు. స్వార్థ ప్రయోజనాలను విడనాడి మిగతా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఆంధ్ర వలస పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. లేదంటే తల్లి తెలంగాణకు వారు ద్రోహం చేసినవారవుతారని వారన్నారు. సమతుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని వారన్నారు.












Click it and Unblock the Notifications