అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్నూలు జిల్లాలో నివసిస్తున్న సూరిబాబు తనయుడు రంజిత్ గత ఆరేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలోని అంట్లాంటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శిల్ప అనే అమ్మాయితో నాలుగు నెలల క్రితం రంజిత్‌కు వివాహం జరిగింది. అయితే శనివారం రాత్రి సమయంలో రంజిత్ భార్య శిల్ప కర్నూలులో ఉంటున్న తన అత్తామామకు ఫోన్ చేసి రంజిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం అందించింది. ఆ తర్వాత చనిపోయాడని సమాచారం అందించింది.
రంజిత్ తండ్రి సూరిబాబు మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం బొంకూరు, మెన్నుపాడు, పుల్లూరు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రంజిత్ మరణించాడని తెలియడంతో సూరిబాబు కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. వెంటనే అమెరికాలోని రంజిత్ స్నేహితులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రంజిత్ చనిపోయినట్టు స్పష్టమైన సమాచారం అందింది. అయితే రంజిత్ ఎలా చనిపోయాడనే విషయంపై ఎవరికీ సమాచారం లేదు.