డల్లాస్ లో తెలుగు వెన్నెల కురిపించిన మేడసాని

సాధారణంగా 48 గంటలు పట్టే శతావధానం ప్రక్రియ ను, కేవలం 8 గంటల్లో పూర్తి చేసి మరో రికార్డ్ ను సృష్టించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి సాహిత్య వేదిక ఆధ్వర్యం లో ప్రతి నెల జరిగే 49 వ "నెల నెలా తెలుగు వెన్నెల " కార్యక్రమంలోభాగం గా, స్థానిక డిఎఫ్‌డబ్ల్యు హిందూ దేవాలయం ప్రాంగణం లో జరిగిన శతావధానం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. 100 మంది పృచ్చకులతో, 200 మంది ప్రేక్షకుల తో ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన శతావధానం దత్తపది, సమస్య, కావ్య పథనం, వర్ణన, ఆశువు అంశాలలో పృచ్చకులు వేసిన ప్రశ్నలు ,అవధానుల వారి సమాధానాలు, డల్లాస్ వాసుల తెలుగు భాషాభిమానానికి, భాషమీద వారికున్న పట్టుని, పంచ సహస్రావధాని మేడసాని మోహన్ అసమాన ప్రజ్ఞ పాటవాలను, వారి జ్ఞాపక శక్తికి అద్దం పట్టాయి.
సాహిత్య వేదిక సమన్వయకర్త అనంత మల్లవరపు కార్య వర్గ సభ్యులైన రమణ జువ్వాడి, నసీం షేక్, శ్రీ. సురేష్ కాజ, విజయ చంద్రహాస్ మద్దుకూరి, డా. నరసింహారెడ్డి ఉరిమిండిని సభకు పరిచయం చేసారు. ముందుగా ఆలయ పూజారుల వేదమంత్రాలతో, పూర్ణ కుంభం తో అవధానుల వారిని సభకు ఆహ్వానించారు. మేడసాని మోహన్ చిరకాల మిత్రులు, డల్లాస్ పద్య పితామహుడు డా. పూదూర్ జగదీశ్వరన్ గారు సంధానకర్తగా వ్యవహరించి పృచ్చకులకు, సభికులకు శతావధాన ప్రక్రియ నియమాలను వివరించారు. ముందుగా దత్తపది అంశంలో, పృచ్చకులు విభిన్న పదజాలంతో సంధించి వారు కోరిన ఉపమానాలను ఎంతో అవలీలగా అవధానుల వారు మొదటి రెండు పాదాలను పూరించారు. సమస్య విభాగంలో అలనాటి అల్లసాని నుంచి ఈనాటి మేడసాని దాకా, అవధానుల వారిని ఇబ్బంది పెట్టే సమస్యలు సంధించి డల్లాస్ వాసులు మేడసాని మోహన్ ప్రశంసలు అందుకున్నారు. ఈ రెండు అంశాలతో పాటు జరిగిన కావ్యపతనం లో భాగం పృచ్చకులు ఎంతో రాగబద్ధంగా/స్వరబద్ధంగా పా డి నటువంటి పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని అంశాలలో మొదటి ఆవృతంలో పూరించిన రెండు పాదాలను భోజన విరామం తర్వాత అవధానుల వారు మిగతా రెండు పాదాలను పూరించి ధారణ చేసి పృచ్చకులకు అందించారు. అలనాటి భాగవతం, రామాయణం, అముక్త్య మాల్యద లాంటి పురాణ కావ్యాలతో పాటు అవధానుల వారు పూరించిన 100 పద్యాలతో అమెరికా లో జరిగిన రెండో శతావధానం, టెక్సాస్ లో జరిగిన మొట్ట మొదటి శతావధానం ముగిసింది. ఈ కార్యక్రమం ఆసాంతం ప్రముఖ హాస్య రమారంజనులయిన వంగూరి చిట్టెన్ రాజు చేసిన అప్రస్తుత ప్రసంగం, వాటికి మేడసాని గారు ఇచ్చినటువంటి సమాధానాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు ఎంఎంఎస్ రెడ్డి, తోటకూర ప్రసాద్ సంయుక్తంగా దుశ్శాలువతో మేడసానిని సన్మానించారు. కార్యక్రమం చివరలో, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు, సంయుక్తంగా రమణాచారి వేదమంత్రాల మధ్య మేడసాని మోహన్‌కు, సువర్ణ అంగులికతో, గజమాలతో ఘనం గా సన్మానించారు. గన్నవరపు నరసింహమూర్తి, శ్రీ సురేష్ కాజ, పూదూర్ జగదీశ్వరన్ మేడసాని మోహన్‌ను ప్రశంసిస్తూ రాసిన పద్యాలూ అందరి మన్ననలు పొందాయి. మేడసాని వారిని సచిన్ టెండుల్కర్‌తో, సూపర్ కంప్యూటర్‌తో పోలుస్తూ రాసినపద్యాలు అందరినీ నవ్వించాయి. టెక్సాస్‌లో జరిగిన ఈ మొట్టమొదటి శతావధానం కార్యక్రమం విజయవంతం కావడంలో, పాలుపంచుకున్న ప్రుచ్చకులకు, ఇతర నగరాలనుండి, డల్లాస్ పరిసర ప్రాంతాలనుండి వచ్చినటువంటి ప్రేక్షకులకు, మూడుపూటల రుచికరమైన భోజనం అందించిన సరిగమ సూపర్ మార్కెట్ అండ్ కెఫేకు, వేదిక అలంకరణకు చేయూత నిచ్చిన సిరి ఇవెంట్స్‌కు, హిందూ దేవాలయం యాజమాన్యానికి, వీడియో తీసిన దేసీప్లాజాకు, లేఖకులుగా తమ విధిని అద్భుతంగా నిర్వహించిన రాయవరం విజయభాస్కర్, శ్రీధర్ సిద్ధలకు, అనేక మంది సేవకులకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యకర్తలకు, డా. నరసింహారెడ్డి ఉరిమిండి వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమానికి మొదటి నుంచి సహాయ సహకారాలను అందించిన పూదూర్ జగదీశ్వరన్, విశ్వం పులిగండల, తోటకూర ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. గత మాసం సాహిత్య వేదిక నాల్గవ వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా నిర్వహించి, మరలా ఈ మాసం శతావధాన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో అనంత్ మల్లవరపు నేతృత్వంలోని సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులను అందరు అభినందించారు.












Click it and Unblock the Notifications