రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత వైద్య విద్యార్థులు మృతి
రష్యాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరిని కాపాడారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
రష్యాలోని వెలికి నొవ్‌గోరోడ్‌లో నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. నది నుంచి ఐదో విద్యార్థిని క్షేమంగా రక్షించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని తెలిపారు.

ప్రమాదానికి గురైన ఐదుగురు విద్యార్థులు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినవారని భారత కాన్సులేట్ అధికారులు తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులేట్ విశ్వవిద్యాలయం, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అలాగే సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు నదిలోనుంచి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లోని కుటుంబాలతోనూ, జిల్లా యంత్రాంగంతో కాన్సులేట్ సంప్రదింపులు కొనసాగిస్తోందని వెల్లడించారు.
మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జలగావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు. నదిలోనుంచి సురక్షితంగా బయటపడిన విద్యార్థికి ఉత్తమ వైద్య సంరక్షణ అందించబడుతోంది. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాలను భారతదేశానికి తిరిగి పంపుతారని మేము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications