అమెరికాలో తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి: భార్య కళ్ల ముందే మరో కారు ఢికొని..
జహీరాబాద్: అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ (30) మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది.
కాగా, వెంకటరమణ రెండేళ్ల క్రితం మృతి చెందారు. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఎనిమిదేళ్లుగా అమెరికాలోని నార్త్ కరోలినాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత సంవత్సరమే ఆయనకు శ్రీప్రియతో వివాహం జరిగింది. బుధవారం భార్యతో కలిసి కారులో వెళ్తూ.. వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు.

వారి కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టాడు. కారులోంచి బయటికి వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయననను ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే పృథ్వీరాజ్ ప్రాణాలు కోల్పోయారు.
కళ్ల ఎదుటే భర్త ప్రాణాలు కోల్పోయాడంతో శ్రీప్రియ కన్నీరుమున్నీరుగా విలపించింది. పృథ్వీరాజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఆదివారం పృథ్వీరాజ్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications