వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-22

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చలు జరగాలని వేదిక పట్టుబడుతూ ఉంది. ఇరు పక్షాలు అందుకు పట్టువిడుపులు ప్రదర్శించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కూడా నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. పార్లమెంటరీ పార్టీలన్నీ చర్చల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. చర్చలకు ప్రాతిపదిక ఏర్పరచడానికి ఇరు పక్షాలు బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలనేది వేదిక వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. చర్చలు ఏ విషయాల మీద జరగాలనేది లేదు. ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపవచ్చు. సమస్యలైతే బోలెడున్నాయి. కానీ నక్సలైట్ల ఉద్యమం ఆ సమస్యల పరిష్కారం కోసం కాదు. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో నక్సలైట్లు పని చేస్తున్నారు. చర్చలు జరగాలా, వద్దా అనే అంశంపై ఒక దిన పత్రిక ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. ఆ పత్రికకు కుప్పలు తెప్పలుగా లేఖలు వచ్చిపడ్డాయి. అందులో అత్యధిక మంది చర్చలు జరగాలని, తెలంగాణలో శాంతి నెలకొనాలని అభిప్రాయపడ్డారు.

ఇటువంటి సందర్భంలోనే పౌర హక్కుల నాయకుడు శ్రీనివాస్‌ రాంరెడ్డి వద్దకు వచ్చాడు. శ్రీనివాస్‌ కూడా ఓ జర్నలిస్టు. ఏవో పిచ్చాపాటీ మాట్లాడకున్న తర్వాత ''చర్చలపై మీ అభిప్రాయం ఏమిటి సార్‌?'' అని అడిగాడు శ్రీనివాస్‌.

''దేని కోసం చర్చలను ప్రతిపాదిస్తున్నారో స్పష్టంగా ఉందా?'' అని అడిగాడు రాంరెడ్డి.

''తెలంగాణలో పీస్‌ఫుల్‌ అట్మామిస్‌ఫియర్‌ కోసం'' అని చెప్పాడు శ్రీనివాస్‌. ఇంత అనిర్దిష్టమైన విషయం మీద చర్చలు సాధ్యమవుతాయా అని ఆశ్చర్యపోయాడు రాంరెడ్డి.

''పౌర హక్కుల సంఘానికో, ఉద్యోగుల సంఘానికో, ట్రేడ్‌ యూనియన్‌కో ఉన్నట్లు నక్సలైట్లకు ఏమైనా డిమాండ్లున్నాయా? ఉంటే వాటిని తీరిస్తే నక్సలైట్లు పోరాటం ఆపుతారా?'' అని అడిగాడు రాంరెడ్డి.

శ్రీనివాస్‌ ఆలోచనలో పడ్డాడు. ''శ్రీలంక ప్రభుత్వం ఎల్‌టిటిఇతో చర్చలకు ముందుకు వచ్చింది కదా!'' అని అన్నాడు.

''ఎల్‌టిటిఇ ఉద్యమ స్థాయిలో ఇక్కడి నక్సలైట్ల ఉద్యమం ఉందా? చర్చలు జరగాలంటే నక్సలైట్లు పూర్తిగా ఆయుధాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వం చెప్పినట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. అప్పుడు అవి చర్చల కిందికి ఎందుకు వస్తాయి? పోరాటాన్ని విరమించుకుంటున్నట్లు అవుతుంది. ఇది సాధ్యమేనా?''

''అవును, ఇప్పటికే ఆయుధాలు వీడితేనే చర్చలు జరుపుతామని ముఖ్యమంత్రి అంటూనే ఉండు'' అని అన్నాడు శ్రీనివాస్‌. రాంరెడ్డి ఆలోచనలో పడ్డాడు. విషయం చాలా మందికి గజిబిజిగా అనిపిస్తోంది. కానీ చాలా స్పష్టంగానే ఉంది.

''ఏమో ఆలోచిస్తున్నారు?'' అడిగాడు శ్రీనివాస్‌.

''ఏం లేదు, ఆయుధాలు వీడే ప్రసక్తి లేదని నక్సలైట్లు కూడా ప్రకటించారు కదా!'' అని గుర్తు చేశాడు రాంరెడ్డి. ఇంట్లో ఎవరూ లేరు. 'టీ చేసుకుందామా?'' అని అడిగాడు రాంరెడ్డి.

సరేనని రాంరెడ్డితో పాటు లేచి వంటింట్లోకి నడిచాడు శ్రీనివాస్‌. స్టౌ మీద టీ పెట్టి నిలుచున్నారు. ఇద్దరి మధ్యా మౌనం.

''ఇంత డ్రామా ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చర్చలు సాధ్యం కావని తెలిసిపోతూనే ఉంది. సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించాలనేవారితో ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో చర్చలు జరుపుతుంది? ఎట్లా జరుపుతుంది? ఎజెండా ఏమిటి? ఈ ప్రశ్నలు తేలకుండానే చర్చలు జరగాలనడమే పెద్ద అబద్ధంలా అనిపించడం లేదా?'' అన్నాడు రాంరెడ్డి ఏదో ఆలోచిస్తూ.

''చర్చల కోసం అడుగుతున్నవారికి ఈ విషయాలు తెలియవంటారా?'' అడిగాడు శ్రీనివాస్‌.

కప్పుల్లో టీ పోసుకొని చెరో కప్పు చేత పట్టుకుని వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు.

''తెలియవని నేనేమీ అనుకోవడం లేదు. తెలిసే చేస్తున్నారని నా అనుమానం. అందుకే వాళ్ల మొదటి మీటింగ్‌కు పిలిచినా నేను వెళ్లలేదు'' చెప్పాడు రాంరెడ్డి.

అవినాష్‌తో పాటు ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు నాయకులు నక్సలైట్‌ పార్టీని నడిపించినప్పుడు చర్చలను బేషరతుగా వ్యతిరేకించారు. చర్చలు సాధ్యం కావనేది తేల్చి చెప్పారు. అటువంటిది వారి మరణం తర్వాత చర్చలను నక్సలైట్‌ పార్టీ ఎందుకు ప్రధానం చేసుకుంటున్నదో రాంరెడ్డికి అర్థం కాలేదు. తీవ్రంగా ఆలోచించాడు. కొంత మందిని అడిగాడు. అతనికి సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. సమాధానం సంతృప్తి కలిగించడం, కలిగించకపోడం అనేది సాపేక్షికమే. నమ్మకం అనేది సత్యం మీద ఆధారపడి వుండదు. విశ్వాసం వేరు, సత్యం వేరు కావచ్చు. సత్యం కానిది కూడా విశ్వాసం కుదిరితే సత్యం లాగే అనిపించవచ్చు. అందుకే నిత్యసత్యాలు, విశ్వజనీన సత్యాలు కూడా ఉండకపోవచ్చునని రాంరెడ్డికి అనిపిస్తూ ఉంటుంది. కేవల సిద్ధాంతం వల్లనే ఏదీ గొప్పదై పోదనేది కూడా రాంరెడ్డి అనుకుంటూ ఉంటాడు. ఆచరణ మాత్రమే చిత్తశుద్ధికి గీటురాయి అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడం కూడా పొరపాటే కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X