• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిత్వానికి ఎల్లలుంటాయా?

By Staff
|

కవిత్వం తప్పకుండా స్థలనిర్దేశితమే. ప్రాంతాలన్నీ ఒక్కటి కానట్లే కవిత్వమంతా ఒక్కటి కాదు. అంటే, ఒకే భాషలో వెలువడిన కవిత్వమంతా ఒకటి కాదు. ఇంకా చెప్పాలంటే, ఒకే కాలంలో వెలువడిన తెలుగు కవిత్వమంతా ఒక్కటి కాదు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, విశ్వాసాల దృష్ట్యా, సైద్ధాంతిక నిబద్ధతల దృష్ట్యా వెలువడిన ఒకే రకమైన కవిత్వమంతా ఒక్కటి కాదు. తెలుగులో వెలువడిన దళిత కవిత్వమంతా ఒక్కటి కాదు. అట్లాగే, స్త్రీవాద కవిత్వం కూడా. ఇది విప్లవ కవిత్వానికి కూడా వర్తిస్తుంది. తెలంగాణా కవిత్వ పుస్తకమొకటి వేయాలని కవితలను ఆహ్వానించినప్పుడు కోస్తావారు కూడా తెలంగాణాపై కవిత్వం రాసి పంపారు. తెలంగాణాకు చెందిన కవి రాసిన కవిత్వానికి, కోస్తాకు చెందిన రాసిన కవిత్వానికి తప్పకుండా తేడా వుంటుంది. ఉదాహరణకు దళిత కవిత్వం తీసుకుందాం-

తెలుగులో విప్లవ, స్త్రీవాద కవిత్వాల తర్వాత అంత ఉధృతంగా వచ్చింది దళిత కవిత్వం. చాలామంది విప్లవ కవులు దళిత కవులుగా రూపాంతరం చెందారు. శివసాగర్‌ 'నల్ల పద్యం' నుంచి సతీష్‌చందర్‌ 'పంచమవేదం' వరకు దళిత కవిత్వమే అన్నారు. కాదని అనలేం. యువకగా విప్లవ పాటను ఉర్రూతలూగించిన కలేకూరి ప్రసాద్‌ దళిత కవిత్వం రాశారు. మధ్యేవాద కవిత్వం రాసిన ఎండ్లూరి సుధాకర్‌, శిఖామణి కూడా దళితకవులయ్యారు. వీరు దళిత కవిత్వం పునాదులు సరిగా పడకముందే కవులుగా నిలదొక్కుకున్నవాళ్లు. మరో ఇద్దరు కూడా బలంగానే దళిత కవులుగా ముందుకు వచ్చారు. వారు-పైడి తైరేష్‌ బాబు, మద్దూరు నగేష్‌బాబు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి లాంటి అగ్రవర్ణ కవులు-'దళం, దళితం రెండూ కావాల'న్నాడు. దళితవాదం వల్ల చాలా మంది కొత్త కవులు వచ్చారు. వీరు ప్రధానంగా తెలంగాణా నుంచి, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా నుంచి రావడం గమనించాల్సి వుంది.

కమ్యూనిస్టుల నేతృత్వంలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాట ప్రాంతం నుంచీ, నక్సలైట్‌ ఉద్యమం బలంగా వున్న తెలంగాణా ప్రాంతం నుంచి కొత్త దళిత కవులు రావడం ఇక్కడ గమనించాల్సి వుంది. వీరు చాలా వరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని, నక్సలైట్‌ ఉద్యమాన్ని మిగతా దళిత కవుల లాగా 'మిత్ర వైరుధ్యంగా' తీసుకున్నట్లు లేదు. 'శత్రు వైరుధ్యంగా'నే స్వీకరించారనిపిస్తుంది. కమ్యూనిస్టులను మాటల్లో కాకుండా (అనధికారికంగా) కాకుండా కవిత్వంలో (అధికారికంగా లేదా బహిరంగంగా) తూర్పారబట్టారు. (ఇందుకు వారు చెల్లించిన మూల్యం ఇక్కడ చర్చనీయాంశం కాదు) లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌లు దళిత కవిత్వానికి అండదండలందించిన మాట వాస్తవమే. అయితే, త్రిపురనేని శ్రీనివాస్‌ను పక్కన పెడితే లక్ష్మీనరసయ్య స్త్రీ, విప్లవవాద కవులకు, దళిత కవులకు మధ్య ఎక్కడో ఒక దగ్గర సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. దళితవాదాన్ని భుజాన మోసిన తెలంగాణా అగ్రవర్ణ సాహితీవేత్తల ప్రయత్నం కూడా అదే. అందుకే, ఎంతో బలంగా ముందుకు వచ్చిన నీలగిరి సాహితి రెండుగా చీలింది. దీనికి నల్లగొండ గోసంగి కవులు పెద్ద అడ్డంకిగా నిలిచారు. ఇక్కడే కవిత్వానికి ప్రాంతం వుంటుందని భావించడానికి వీలుంది.

ఈ లెక్కన తెలంగాణా నుంచి వెలువడిన దళిత కవిత్వం, కోస్తా నుంచి వెలువడిన దళిత కవిత్వం ఒక్కటి కాదు. బహుశా, ఆకాంక్షలు కూడా ఒక్కటి కావు. ఈ తేడా ఎందులో వుంది? సంస్కృతిలో వుంది. అంటే, ఇది సామాజికం. అందుకే, భాషలోను, వ్యక్తీకరణలోను దళిత కవిత్వంలో రెండు పాయలు కనిపిస్తాయి. సామాజికంగా చాలా సామాజిక అడ్డంకులను దాటి వచ్చినవారు కోస్తా దళిత కవులు. ఇంకా దాటడానికి ప్రయత్నిస్తున్నవారు దళిత కవులు. బ్రిటిష్‌ ఇండియా పాలనలో దళితులు మిషనరీ చదువుల వల్ల అభివృద్ధి పథంలో ముందున్నారు. చదువు వల్ల వారు సామాజిక అడ్డంకులను అధిగమించగలిగారు. ప్రస్తుతం దళిత కవిత్వం రాస్తున్న కోస్తా దళిత కవులు తాతల తరం నుంచీ, కనీసం తండ్రుల తరం నుంచీ విద్యనార్జించిన కుటుంబాల్లోంచి వచ్చినవారు.

తెలంగాణాలో ప్రస్తుతం కవిత్వం రాస్తున్న దళిత కవులు చాలామంది తొలితరం విద్యావంతులు మాత్రమే. అందువల్ల సంస్కృతిలో తేడా ఈ రెండు ప్రాంతాల కవుల మధ్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదే తేడా కవిత్వంలోనూ కనిపిస్తుంది. తెలంగాణా దళిత కవులు తమ కవిత్వం ద్వారా అస్తిత్వాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తుంటే, కోస్తా దళిత కవులు చివరి అంతస్థును అధిరోహించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా దళితవాదాన్ని సమర్థిస్తున్న తెలంగాణా అగ్రవర్ణ కవులు, కోస్తా దళిత కవులు సాంస్కృతికంగా ఒక స్థాయిలో వున్నవారు. అందుకే, వీరికి తెలంగాణా దళిత కవుల వాదనలు హేతురహితంగాను, పిడివాదనలుగాను, మొరటుగాను కనిపిస్తుంటాయి. అందువల్ల, కవిత్వానికి ఎల్లలుంటాయని అంగీకరించక తప్పదు. ఇదే సమయంలో సంస్కృతి అనేది సరిహద్దులను నిర్ణయిస్తుందని కూడా అంగీకరించాల్సి వుంటుంది. రెండు ప్రాంతాల కవిత్వాల మధ్య తేడా వున్నట్లే రెండు ప్రాంతాల ఆకాంక్షల మధ్య కూడా తేడా వుంటుంది. ఈ ఆకాంక్షలనే కవిత్వమే కాదు, ఏ సాహిత్య ప్రక్రియ అయినా ప్రతిబింబిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X