• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖ చిత్రాలు

By Staff
|

(రచనావ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకునే రచయితలు చాలా వరకు తెర ముందుకు రావడానికి ఇష్టపడరు. రూబెన్‌ చాలా కాలంగా హిందీ కథలను తెలుగులోనికి అనువదిస్తున్నారు. అయినా ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ మధ్య ఆయన 'రెక్కలు' పేరుతో అనువాద కథల సంకలనం వెలువరించారు. హిందీ కథల మాధుర్యం తెలిసిన వారికి మిగతా భాషల కథలు అంతగా రుచించవు. వాటి గొప్పతనం అది. అనువాదంలో కూడా ఆ మాధుర్యాన్ని తెచ్చి పెట్టారు కిన్నెర రూబెన్‌. ఈ కథలపై ప్రముఖ తెలుగు కథా రచయిత డాక్టర్‌ వి. చంద్రశేఖరరావు ఆ పుస్తకానికి ముందుమాటగా రాసిన వ్యాసం అందిస్తున్నాం.)

సౌందర్యాన్ని చిదిపివేసిన తర్వాత- కలతబారిన సాయంకాలాల చూర్లలో గుత్తులు వేలాడే ముఖాలు-
ముఖాల్నిటు తిప్పి- హత్య కనబడదు- యుద్ధం, విధ్వంసం మాత్రం ముఖాల నిండా- రెక్కలు కథలోని 'నాయిక'లా-
దుఃఖానికొక మరణపు తొడుగు వేసి-
అనగనగా నాటకం- తెర ఎత్తి- రంగస్థలాన్ని చూద్దాం! అక్కడా ఛిద్రమైన ముఖచిత్రాలే!
శకుంతల, దుష్యంతుడు, కణ్వుడు- 'శకుంతలను దుష్యంతుడు మరిచిపోడానికి వీల్లేదంటూ' ఆడియన్స్‌ నినాదాలు చెయ్యటం- మనకు నవ్వు రాబోతుంది- అక్కడా ఒక దుఃఖ ముఖచిత్రం- ఆకలి ముఖ చిత్రం-
మరో ముఖచిత్రం- బెంగాల్‌ కరువు 'ఆకలి రంగు నలుపు' కథలో లాగా- ఆకలి, మరణం- శవం ముఖంపై చర్మాన్ని పీకి- హిందువా, ముస్లిమా- అని పోలికలు వెతికే- మతం మన ముఖాల చుట్టూ దట్టమైన చర్మపు ముఖ కవచాన్ని కప్పుతూ-
ఒక ముఖచిత్రం- 'గృహోన్ముఖంగా' కథలోలాగా- మానవ సంబంధాల విధ్వంసం
గురించి చెబుతుంది. 'నేను', 'నా సుఖం' అనే మంత్రం మనకు ప్రియమవటం- రిటైర్‌ అయి ఇంటికి వచ్చిన ఆసామి- పారేసిన చెక్క మంచంలా-
ఒకళ్ల ముఖాలు మరొకరు మార్చుకుంటూ- గారడీ వాడి బుట్టలో లాగా- మన ముఖాలన్నీ మారిపోయి- వాడి ముఖం వీడికి, వీడి ముఖం ఇంకొకడికి- పాత శరీరాలకు కొత్త ముఖాల్లా-
ఈ కథలు ముప్పయి ఏళ్లనాటివి. హిందీలో రాసినవి! అయితే ఆశ్చర్యం- ఇవాల్టి కథల్లాగే- తెలుగులో ఇప్పుడొస్తున్న గొప్ప కథల్లాగే- ఉండటము....బహుశా అంతటా ఇదే జీవితం- ఇదే గారడీ- ఎవడో మన ముఖాల్ని మార్చి వేస్తున్నాడు.

ఒక ముఖం మనల్ని చూసి నవ్వుతుంది. ఆ నవ్వులో జీవం వుండదు. జేబులో కత్తులు దాచుకొన్న హంతకుడు- కత్తి విసిరే ముందు- నవ్వు విసుర్తాడు- గాయపడ్డ మనిషి ముందు కూలబడి ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు- కత్తిని శుభ్రంగా కడిగి- ముమ్మారు కళ్లకు అద్దుకొని- తన పేరు నేలపై రాసి వెళతాడు- శవం చుట్టూ మూగిన మనకు నేలపై 'భగవంతుడు' అనే అక్షరాలు వెక్కిరిస్తూ కనబడతాయి.

'చావు విందు' కథ చదివాక- ఆ కథ మనల్ని చూసి అట్లా వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరో ముఖచిత్రం- సాయంకాలపు శీతస్పర్శ- ఒక వాసన- మనుషులు కుళ్లుతున్న వాసన- శరీరాల్లో మరణం లాంటిదేదో ప్రవేశించి- మనిషి చావడు- కానీ మరణం మన అనుభూతిలోకి వస్తుంది.

కవులు, కథకులు అబద్ధాలు చెప్పరు- నిజాలే చెబుతారు. అమ్మకాలు, బేరాలు సాగే 'మార్కెట్టు' లాగా మన జీవితాలు మారిపోయిన నిజాన్ని- అప్రియమైనా- తీతువు పిట్టలాగా కూస్తారు. ప్రమాద సంకేతాన్ని పాడే 'రుంజ' గాయకుల్లా- వాళ్లట్లా హెచ్చరిస్తుంటారు- అదొక బాధ్యత- బహుశా అదొక అబ్సెషన్‌ కూడా అయి వుంటుంది. కథలు రాసి, లేదా అనువాదం చేసి-

ఈ కథలు చెప్పే తీరాలి-
బహుశా ఇప్పుడే, ఈ రాత్రే-
అట్లాంటి కంపల్సన్‌లోంచి వచ్చిన కథలు ఇవి! సమాజంపనై తనకున్న బాధ్యత ఈ కథలన్నిటిలో కనిపిస్తుంది.

రూబెన్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు- అదొక పవిత్ర బాధ్యత ఆయనకు.
సమాజానికి కథలు చెప్పి, ముఖచిత్రాలు వెలికి తీసి, ప్రదర్శించి-
ఈ కథలన్నిటిలోను అధ్యాపకుడి ఓర్పు, నేర్పు కనిపిస్తాయి. కథల నిండా వెచ్చని ఊపిరులు- గొప్ప జీవితం. ఈ కథా ముఖచిత్రాలు అవి దుఃఖిస్తాయి. దుఃఖాన్ని మన లోపల ప్రవేశపెట్టి- మనల్ని మెలిపెట్టి, మరపట్టి, మన లోతైన డొల్లలోకి ప్రవేశపెట్టి-
దుఃఖం సౌందర్యంగా పరివర్తనం చెందటం ఈ కథల్లో చూస్తాము-
దుఃఖం వికసించే దేహాలుగా మారటం ఈ కథల్లో మనం చూస్తాము-
ఈ కథల్ని చదివి- గుట్టలు, గుట్టలుగా పడి వున్న ముఖాల్ని ఒక్కొక్కటే ఏరుకొని, ఇది నీదా, ఇది నాదా, ఈమెదా అంటూ పోలిక వెతుక్కునే గమ్మత్తయిన ఆట కోసం ఈ కథల్ని చదువుదాం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X