వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఠా మేస్త్రీలు వేరే ఉన్నారు!

By Staff
|
Google Oneindia TeluguNews

సాహిత్యానికి చరిత్ర వుండదా?! సాహిత్యానికీ సాంఘిక స్థితిగతులకు సంబంధం ఉండదా?! ఉండవనే అంటున్నారు ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌. కొత్త తరం కవులను పరిచయం చేస్తూ నేను రాసిన వ్యాసానికి ప్రతిస్పందిస్తూ ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరి కొన్ని స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. సాహిత్యానికి, తరం అనే మాటకూ సంబంధమే లేదంటారాయన. ఇది నిజంగా విచిత్రమైన వాదన. తరం అనే మాట కేవలం చరిత్రకు సంబంధించిందేనట. అంటే సాహిత్యానికి చరిత్ర లేదన్న మాట. ఇప్పటి వరకూ తమ తమ రచనల్లో, వ్యాసాల్లో, పరిశోధక గ్రంధాల్లో సాహిత్య చరిత్ర అనే మాట వాడినవారందరూ నాలుక్కరుచకోవాలి కామోసు. సాహిత్యంలో తరాలు వుంటాయో లేదో, తరాల నడుమ అంతరాలు ఉంటాయో లేదో తెలియకుండానే ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ సాహిత్య విమర్శకు దిగి వుంటారని నేననుకోను. ఆవేశంలో పెన్ను జారి వుంటారంతే! మనవాళ్లతో వచ్చిన చిక్కే ఇది. పద అర్థాలకు ఎక్కువ స్పేస్‌ ఇచ్చి, జార్గన్‌తో గొడవ పడాలని చూస్తారు. అందుకే అపార్థాలు అమితం. సాహిత్య సాంఘిక స్థితి గతులకు అనుగుణంగా, సాహిత్య చరిత్రలో భాగంగా జరిగే మార్పులను, పరిణామాలను గుర్తించి రికార్డు చేసేందుకు జరిగిన ప్రయత్నాలు కూడా అందుకే ముఠాలను తయారు చేయడంగా కనిపిస్తాయి. నేను నెంబర్‌ వన్‌ కవులు ఇక పెన్ను మూసేయొచ్చు అంటే శివారెడ్డిని పెన్ను మూసేయమని అన్నట్టుగా తప్పుడు అర్థం తీసుకున్నారు ప్రవీణ్‌కుమార్‌. నా వ్యాసంలో నేను శివారెడ్డి నెంబర్‌ వన్‌ కవి అని కానీ, శివారెడ్డి పెన్ను మూసేయాలి అని కానీ అననే లేదు. ఇది కేవలం ఒద్దిరాజువారి రజ్జు సర్ప భ్రాంతి. శివారెడ్డి నెంబర్‌ వన్‌ కవి అనీ, స్టార్‌ కవి అనీ ఒద్దిరాజు వారే అనుకుని వెంటనే ఖండన ముండనలకు దిగిపోతే ఆ నేరం నాదెలా అవుతుంది. అయినా నేను రాసింది పెన్ను మూసెయ్యొచ్చు అని మాత్రమే. ఈ మాటలో ఆదేశం కానీ కనీసం ప్రతిపాదన కానీ లేవు. అదొక చమత్కారం మాత్రమే. ఒకరు మూసేయమంటే కవులు పెన్నులు మూసేయరనే విషయం ఒద్దిరాజుకే కాదు నాకూ తెలుసనే అనుకుంటాను. తనలో నిప్పుకణికలు మండుతున్న కవి మరణ శయ్య మీద పడుకుని కూడా కవితాగానం ఆలపించాలని నేననుకుంటాను. అయితే ఫైర్‌ ముఖ్యం.

ఇక పోతే కొత్త ముఠాను తయారు చేయడం గురించి. సాహిత్య చరిత్ర పరిణామ క్రమాన్ని నమోదు చేయడం వరకే నేను చేసిన పని. సాహిత్య చరిత్ర పరిణామక్రమంగా నేను చెపుతున్న అంశాలలో, ఇచ్చిన వివరణలో తప్పు ఉంటే దండించండి, కాదనను. నేను చెప్పిన ఆరుగురో ఎనిమిది మందో కొత్త స్వరంతో రావడం లేదు అని రుజువు చేయగలిగితే చేయండి. నా తప్పు తెలుసుకుని వెనక్కు తగ్గుతాను. అంతే తప్ప వాళ్లందరినీ కొత్త తరంగా నేను చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూనే ఆ ప్రతిపాదన చేయకూడదని నా మీద ఆంక్షలు విధించడం మాత్రం కచ్చితంగా దౌర్జన్యమే. కవిత్వం స్వరం మారుతున్నది, తరం మారుతున్నది అని ఒక సూత్రీకరణ జరిగినంత మాత్రాన ఆ కవులందరూ ఒక ముఠాగా ఏర్పడి పోతారని ఒద్దిరాజు వ్యక్తం చేస్తున్న భయం కూడా అర్థం లేనిదనే నేననుకుంటున్నాను.

కవిత్వం ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుందని ఒద్దిరాజు అంగీకరించారు. అయితే కవిత్వ రూపాన్ని మాత్రమే మనం చర్చించాలి తప్ప చర్చలను కవుల దాకా పొడిగించకూడదన్నారు. నేను నా వ్యాసంలో చర్చించిందంతా కవిత్వ రూపం, సారం గురించే కదా. కవుల దాకా చర్చను పొడిగించడమంటే ఫలానా కవి అని చెప్పడమేనా? కవిత్వం ఎవరిదో చెప్పకుండా రూపం గురించిన చర్చ ఎలా సాధ్యం? సాహిత్యంలో 'రాండమ్‌ సాంపిల్‌' పద్ధతులుండవు కదా.

ఇక గద్దె పదిలం చేయడం గురించి. కవితా ప్రపంచం బస్సులోనో, సినిమా హాల్లోనో రుమాలు వేసి సీటు ఆపుకోవడం లాంటిది కాదు. ప్రసేన్‌ ప్రయత్నం చేసినంత మాత్రాన అది శ్రీకాంత్‌కో, ప్రసేన్‌ ఇష్టులకో దక్కుతుందనుకోవడం కూడా భ్రమే. ఒక వేళ నా వ్యాసంతో ఆ కవులు అతిశయం పోతే జరిగేవి ఆత్మహత్యలే. అసలు ఒద్దిరాజువారు ఎందుకు అతిగా ఆందోళన చెందారో నాకైతే అర్థం కాలేదు. కొత్త ముఠా ప్రాణం పోసుకుంటే పాత ముఠా ఏదో ప్రాణం పోగొట్టుకోబోతోందని ఆయన బెదిరి పోయినట్టున్నారు. ఒద్దిరాజుగారూ ఎందుకండీ మనకీ ముఠాల గొడవలు! ముఠా మేస్త్రీలు వేరే వున్నారు!

కొత్త తరం రాకడ ఒక వాస్తవం. కొత్త స్వరం పుట్టుక ఒక సత్యం. వాస్తవాలను, సత్యాలను అంగీకరించకుండా భయాలతో, మూఢ నమ్మకాలతో ముసుగు కప్పేయాలనుకోవడం సాహిత్య ద్రోహం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X