వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేబులో సున్నితపు త్రాసు వేసుకుతిరిగే వ్యక్తి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆయన వయసు యాభయ్యేళ్ళలోపు. అనుభవం పాతికేళ్ళకుపైనే. కానీ మనిషితో ఒక్కసారి మాట్టాడితే చాలు. అతగాడి వయసు పాతికేళ్ళే కానీ అనుభవం మాత్రం యాభయ్యేళ్ళనిపిస్తుంది. ఆ 'ముదురుకేసు' పేరు పి.రాజేశ్వరరావు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌గా వుంటున్న రాజేశ్వరరావు అక్షరాలా ఒంటిచేత్తోనే రెండున్నర కోట్ల వార్షిక వాణిజ్యం జరిపిస్తున్నారు. శారీరకమైన పరిమితులు తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడడంలో రాజేశ్వరరావు ఆదర్శప్రాయంగా వ్యవహరించారంటే అది అతిశయోక్తి కాదు. పైపెచ్చు ఎంతో విచిత్రమైన వ్యక్తిత్వం ఆయనది. జేబులో సున్నితపు త్రాసు వేసుకు తిరుగుతాడేమో అన్పిస్తుంది. అవసరమైన మేరకే అడగడం, అక్కర్లేదనుకున్న విషయాలను దాటేయడం - ఒక్క ముక్కలో చెబితే ఆచితూచి మాట్టాడడం రాజేశ్వరరావు గారి స్వభావం. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తితో ఇంటర్వ్యూ చెయ్యడం చాలా కష్టం. ఆయన చెప్పిన ముక్తసరి ముచ్చట్లను ఆసక్తికరంగా రాయడం మరింత కష్టం. కానీ ఒకసారి ఒప్పుకున్నాక తప్పుతుందా మరి! మండే మే నెల ఎండల్లో ఆయనతో చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం కేవలం మీ కోసం! చిత్తగించండి!!

''నన్నడిగితే పుస్తకాలు కన్స్యూమర్‌ గూడ్స్‌ మాత్రమే కానీ కమోడిటీస్‌ కాదంటాను. మన దేశం సంగతి చెబుతున్నాను. ఇక్కడ దేన్నయినా అమ్మగలం - ఒక్క పుస్తకాలను తప్ప'' - రెండున్నర దశాబ్దాలుగా పుస్తక వాణిజ్యంలో తలమునకలుగా ఉన్న విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రాజేశ్వరరావు మనసులో మాట ఇది. ''ఉత్తర భారతదేశం సంగతి అలా ఉంచండి. అక్కడి పరిస్థితులు అలా ఉండడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దక్షిణాదిరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల మేరకు అక్షరాస్యత అభివృద్ధి చేశాయి. ఈ రంగంలో కేరళ అందరికన్నా ముందుంది. తర్వాతిస్థానం తమిళనాడుది. ఆ తర్వాత కర్ణాటక ఉంది. అందరికన్నా ఆఖర్న మనం ఉన్నాం. అందుకే మన రాష్ట్రంలో పుస్తకాల వ్యాపారం మరింత కష్టంగా పరిణమించిం''దని రాజేశ్వరరావు వివరించారు. ప్రస్తుతం పుస్తక విక్రయంలో కనిపించే ధోరణుల గురించి వ్యాఖ్యానిస్తూ ''ఈ దశను నాన్‌ఫిక్షన్‌ యుగంగా పరిగణించవచ్చు''నన్నారాయన. ''నవలలకు ఏమాత్రం చెలామణీ లేదని అందరికీ తెలిసిందే. కొంతకాలం కథల పుస్తకాలు బాగానే పోయాయి. దాంతో ఫిక్షన్‌ రచయితలంతా కథలు మొదలుపెట్టారు. డజన్ల సంఖ్యలో కథాసంకలనాలు వచ్చి పడ్డాయి. సప్లయ్‌ డిమాండ్‌ సూత్రమే పనిచేసిందో - మరి పాఠకులకు కథలంటే మొహం మొత్తిందో తెలీదు కానీ మొత్తానికి కథలకు సైతం మార్కెట్‌ లేకుండా పోయింది. ఇక కవిత్వం సంగతి చెప్పక్కర్లేదు. నా అనుభవసారంలోంచి వచ్చిన మాట అది'' అన్నారు రాజేశ్వరరావు.

''నాన్‌ఫిక్షన్‌ యుగం కదా అని ఎవరేం రాసినా చెల్లుబడి అయిపోతుందనుకోవడం అమాయకత్వం. ఉదాహరణకు వ్యక్తిత్వ వికాసం గురించి రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉన్నమాట నిజం. కానీ దారుణంగా విఫలమైన రచయితలు కూడా ఉన్నారీ రంగంలో. 'రేపు' సి.నరసింహారావు, యండమూరి వీరేంద్రనాథ్‌ లాంటి వాళ్ళు వ్యక్తిత్వవికాసం మీద రాసిన పుస్తకాలు పునఃపునః ముద్రణ అవుతూనే ఉన్నాయి. కానీ చాలామంది చేతులు కాల్చుకున్నవాళ్ళూ ఉన్నారు. కారణం ఏమిటో కాస్తంత తీరిగ్గా ఆలోచించుకోవాలి'' అని రాజేశ్వరరావు సలహా ఇచ్చారు. ''అసలు ఈ తరహా పుస్తకాల కింత గిరాకీ ఎందుకొచ్చింది? ఈ తరం విలువలు ఏమిటో గుర్తిస్తే తప్ప ఆ విషయం బోధపడదు. స్వాతంత్ర్యం వచ్చి యాభయ్యేళ్ళు దాటింది. ప్రజా ఉద్యమాల ప్రాబల్యం కూడా తగ్గింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టీ కెరియర్‌ మీద కేంద్రీకృతమై ఉంది. సహజంగానే ఆ రంగంలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. దాని ఫలితంగా వత్తిడి. దాన్నెలా తట్టుకోవాలో బోధించేది వ్యక్తిత్వ వికాస గ్రంధాలని ప్రజల నమ్మకం. దానివల్లనే ఆ తరహా పుస్తకాలకు అంత గిరాకీ. ఈ నమ్మకాల్లోని నిజానిజాలు పక్కన పెట్టి చూస్తే, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలకు కనీవినీ ఎరుగని గిరాకీ ఏర్పడిన మాట కాదనలేని వాస్తవం'' అంటారాయన.

''ప్రస్తుతం ప్రచురణలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. కొనుగోలుదారుకు ఎంచుకునే స్వేచ్ఛ మరింత విస్తృతమయింది. ఒక పోలిక చెప్పాలంటే ఈ రంగంలో 'బఫే' తరహా విందుభోజనం ఏర్పాటయింది. ఎవరికేది ఎంత కావాలో అంతా పొందుతున్నారు. ఇందులో బ్రాండ్‌ వాల్యూ ఉన్న రచయితలు కాస్త ఎక్కువగా లాభిస్తున్నారు. అనామకులు ఇనిషియల్‌గా అనాదరణకు గురవుతున్నా సరకులో సత్తా ఉంటే పుంజుకుంటున్నారు. ఆమధ్యన గుంటూరు శేషేంద్రశర్మగారు కలిశారు. ప్రస్తుతం ఎలాంటి కవిత్వం బాగా పోతోందని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా సరుకులో సత్తా ఉంటే బాగానే పోతూ ఉంటుంది సార్‌ అన్నాను. ఆయనక్కాస్త బాధ కలిగింది. ఎందుకంటే శర్మగారి పుస్తకాలు కొన్ని అంతగా అమ్ముడుకాలేదు. వాటిల్లో సత్తా లేదంటారా అని నన్ను నిలదీశారాయన. నేను ఒకటే సమాధానం చెప్పాను - మహాకవి శ్రీశ్రీ రచనల్లో కూడా అమ్ముడుకాని పుస్తకాలు కొన్ని లేకపోలేదు. కవి నియంత అని ఎవరో ఎప్పుడో అన్నారట. ఆ మాట నిజమోకాదో కానీ ఒకమాట వాస్తవం. పాఠకుడు మాత్రం నియంతే!'' అని సూత్రీకరించారు రాజేశ్వరరావు. ''వ్యక్తిత్వవికాసం పుస్తకాల విషయంలో నా అభిప్రాయం ఒకటి చెప్పి, వేరే విషయం ఎత్తుకుంటాను. టి.వి.ఎస్‌., వి.జి.పి., జి.పుల్లారెడ్డి, రామోజీరావు - వీళ్ళు ఏ వ్యక్తిత్వ వికాస గ్రంధాలు చదివి అంత స్థాయిలో విజయవంతం కాగలిగారో ఒక్కసారి ఆలోచించండి. కొత్తదనం - మంచిదనం కలగలిస్తే విజయం మన దగ్గరకి వెతుక్కుంటూ వస్తుందని నా అభిప్రాయం'' అని అంటారాయన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X