ఆధిపత్యానికి వ్యతిరేకంగానే: కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెల్లుబికిందేనని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గౌతమ్ పింగ్లే 'ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ' పుస్తకాన్ని గురువారం సాయంత్రం పర్యాటకభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. విలీనం నాటి నుంచి తెలంగాణ ప్రాంతంపై ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతూనే ఉందని, ఆ ఆధిపత్యానికి వ్యతిరేకం గా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని ఆయన అన్నారు.
విభజనతో జాతి సమగ్రతకు భంగం వాటిల్లుతుందంటున్న వాళ్లే ఇంతకాలం తెలంగాణపై వివక్షను కొనసాగించారన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష పెల్లుబికిందని, అది ఒక రాజకీయ నినాదంగా మారిందని అన్నారు. విభజనతో నష్టం జరుగుతుందని ఆం ధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించిన ప్రభుత్వం, పోలవరం ముంపు ప్రాంతాల్ని సైతం ఆంధ్రలో కలపడానికి సిద్ధమైందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా తెలంగాణ పోరాటం మిగిలే ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ ప్రయోజనాల కో సం పోలవరం ప్రాజెక్టు కింద మూడు లక్షల మంది ఆదివాసీలను ముంపునకు గురిచేసేందుకు సిద్ధమవడం అప్రజాస్వామికమన్నారు. గవర్నర్ కు శాంతి భ ద్రతలు అప్పగించడమంటే ఇక్కడి ప్రజలపై విశ్వాసం లేకపోవడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర వర్తమానం గురించి పుస్తకంలో గౌతమ్ నిశితంగా వివరించారని అన్నారు.
మాజీ ఎంపీ పండిట్ ఎం నారాయణ రెడ్డి మాట్లాడుతూ - తెలంగాణ సాధించున్నా.. చేయాల్సిన పోరాటం మిగిలే ఉందన్నారు. పుస్తక రచయిత గౌతమ్ పింగ్లే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన వెనక ఎందరో అమరుల త్యాగం ఉందన్నారు.












Click it and Unblock the Notifications