27 ఏళ్ల తర్వాత అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం! 100 కోట్ల మంది చూడబోయే అద్భుతం
ఖగోళ ప్రియులకు, సామాన్య ప్రజలకు అత్యంత అరుదైన విజువల్ ఫీస్ట్ అందుబాటులోకి రాబోతోంది. సుదీర్ఘమైన 28 నెలల విరామం తర్వాత భూమిపై 'సంపూర్ణ సూర్య గ్రహణం' (Total Solar Eclipse) సంభవించబోతోంది. 2024 ఏప్రిల్ 8న ఉత్తర అమెరికా ఖండంలో కనిపించిన ఆఖరి సంపూర్ణ గ్రహణం తర్వాత మళ్లీ ఇప్పుడు ఆగస్టు 12న ఈ అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యంగా యూరప్ ఖండానికి ఇది ఎంతో ప్రత్యేకమైన సంఘటన కానుంది.
27 ఏళ్ల తర్వాత ఐరోపాలో అద్భుతం!
సాధారణంగా భూమిపై ప్రతి 16 నెలలకు ఒకసారి ఎక్కడో ఒకచోట సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ.. ఈసారి మాత్రం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. అందులోనూ ప్రధాన ఐరోపా ఖండంలో 1999 ఆగస్టు 11 తర్వాత, అంటే దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించబోతోంది. నాటి నుంచి ఇప్పటివరకు రష్యా, జార్జియా, నార్వే ప్రాంతాల్లోని సుదూర ఐలాండ్స్కు మాత్రమే ఇది పరిమితం కాగా.. ఇప్పుడు యూరప్‌లోని మెయిన్ ల్యాండ్ ప్రాంత ప్రజలు దీనిని వీక్షించనున్నారు.

పగలే రాత్రిలా మారే 'మ్యాజికల్' దృశ్యం!
సూర్యుడు, భూమికి మధ్యలోకి చందమామ నేరుగా వచ్చి.. సూర్య బింబాన్ని పూర్తిగా కప్పివేసినప్పుడు ఈ సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం సమయానికి చేరినప్పుడు కొన్ని నిమిషాల పాటు మిసమిసలాడే సూర్యకాంతి మాయమై, చీకటి అలుముకుంటుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తాయి. చందమామ నల్లటి నీడ వెనుక సూర్యుడి వెలుపలి వలయమైన 'కరోనా' కిరీటంలా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని కళ్లారా చూడటం ఒక అరుదైన అనుభూతి.
దాదాపు 100 కోట్ల మంది వీక్షించే అవకాశం!
అంతర్జాతీయ జనాభా గణాంకాల ప్రకారం.. ఈ గ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 98 కోట్ల (980 మిలియన్) మంది పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 1.5 కోట్ల మంది సూర్యుడు పూర్తిగా కనపడని 'పాత్ ఆఫ్ టోటాలిటీ' (Path of Totality) మార్గంలో నివసిస్తున్నారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రం, కరోనా తీవ్రత, అంతరిక్ష వాతావరణాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు.




Click it and Unblock the Notifications