అన్నం Vs గోధుమలు: ఏది సేఫ్? శాస్త్రవేత్తల రిసెర్చ్ లో షాకింగ్ నిజాలు
బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేసే పని అన్నం మానేస్తుంటారు. చపాతీలు, రోటీలు కూడా బంద్ చేస్తారు చాలా మంది. అయితే, అసలు సమస్య పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా తినడంలో ఉందా లేక అవి మన శరీరాన్ని ప్రభావితం చేసే తీరులో ఉందా? అనే కోణంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం తక్కువ కేలరీలు తీసుకున్నా, పిండి పదార్థాల ప్రభావం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
Osaka Metropolitan University ప్రొఫెసర్ షిగెనోబు మత్సుమురా నేతృత్వంలోని బృందం ఎలుకలపై ఈ పరిశోధన చేసింది. ఎలుకలకు వాటి సాధారణ ఆహారంతో పాటు రొట్టె, అన్నం, గోధుమ పిండి వంటి పదార్థాలను అందించారు. ఆశ్చర్యకరంగా, ఎలుకలు తమ సాధారణ ఆహారాన్ని పక్కనపెట్టి, ఈ పిండి పదార్థాలనే ఇష్టంగా తిన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అవి ఎక్కువ కేలరీలు తీసుకోకపోయినా, వాటి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరిగాయి.

అతిగా తినడం వల్ల కాదు.. శక్తి ఖర్చు కాకపోవడం వల్లే!
సాధారణంగా ఎక్కువ తినడం వల్లే బరువు పెరుగుతారని మనం అనుకుంటాం. కానీ, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు శరీరం 'తక్కువ శక్తిని' ఖర్చు చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంటే, మనం తిన్న ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా పేరుకుపోతోంది. శ్వాస వాయు విశ్లేషణ ద్వారా జరిపిన పరీక్షల్లో, పిండి పదార్థాలు శరీరంలోని శక్తి వ్యయాన్ని (Energy Expenditure) తగ్గిస్తున్నాయని తేలింది. దీనివల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, రక్తంలో కొవ్వు ఆమ్లాలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
గోధుమలు మాత్రమే కారణం కాదు!
బియ్యం పిండి తీసుకున్న ఎలుకలు కూడా గోధుమ పిండి తిన్న వాటితో సమానంగా బరువు పెరిగాయి. అంటే, కేవలం గోధుమల వల్లే బరువు పెరుగుతారనేది నిజం కాదని, పిండి పదార్థాలపై మనకున్న విపరీతమైన ఇష్టమే (Craving) ఇందుకు ప్రధాన కారణమని ప్రొఫెసర్ మత్సుమురా స్పష్టం చేశారు. అయితే, ఒకసారి ఆహారం నుంచి ఈ పిండి పదార్థాలను తగ్గించి, సమతుల్య ఆహారం (Balanced Diet) ఇవ్వగానే ఎలుకల్లో బరువు, జీవక్రియ సమస్యలు వేగంగా మెరుగుపడ్డాయి.
త్వరలో మనుషులపై పరిశోధన..
ప్రస్తుతానికి ఎలుకలపై చేసిన ఈ ప్రయోగాన్ని త్వరలో మనుషులపై కూడా నిర్వహించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మనం తినే సమయం, ఆహార తయారీ పద్ధతులు, పీచు పదార్థాలు (Fiber) కలిపి తీసుకోవడం వల్ల ఈ జీవక్రియ మార్పులను ఎలా అరికట్టవచ్చో పరిశీలించనున్నారు. 'రుచి' మరియు 'ఆరోగ్యం' మధ్య సమతుల్యతను సాధించడానికి ఈ పరిశోధన ఒక బలమైన శాస్త్రీయ పునాదిగా మారుతుందని వారు ఆశిస్తున్నారు.














Click it and Unblock the Notifications