చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు ఇది: అప్పుడే ఏడాది గడిచిందంటే..
ISRO: నేడు- కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించిన రోజు. చందమామ చేతికి అందిన సుదినం. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది.. భారత్ నింగిని జయించిందీ ఈ రోజే. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరిందీ నాడే.
ఏడాది కిందట..
సరిగ్గా ఏడాది కిందట భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడిపై అడుగు పెట్టింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చందమామ దక్షిణ ధృవంపై అడుగు మోపింది.

ఉపరితలంపై..
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై అడుగు మోపింది.
నాటి పిక్స్ వైరల్..
ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ తీసిన తొలి ఫొటోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ ధృవానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తీసినవి, ల్యాండ్ అయిన అనంతరం చంద్రుడి ఉపరితలపై ధూళి చెలరేగిన దృశ్యాలు.. అలనాటి మధుర స్మృతులను మళ్లీ గుర్తు చేస్తోన్నాయి.
కనెక్టివిటీ సాధించడంతో..
అప్పట్లో ఆ ఫొటోలను తీసిన విక్రమ్ ల్యాండర్.. వాటిని బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మిషన్ ఆపరేషన్స్ సెంటర్‌కు పంపించింది. ఈ ఫొటోలు రావడంతో- విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్‌తో పూర్తిస్థాయిలో కనెక్టివిటీనీ సాధించినట్టయింది.
హర్షాతిరేకాల్లో..
రెండు వైపుల నుంచి కనెక్ట్ ఏర్పడిందని, తాము పంపించిన సిగ్నల్స్‌ను ల్యాండర్ రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. తన డేటా, ఫొటోలను సైతం పంపించగలిగినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన తొలి ప్రకటనతో దేశం యావత్తూ హర్షాతిరేకాల్లో మునిగిపోయింది. కేరింతలు కొట్టింది.
నాలుగో దేశంగా..
దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది.. భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా మాత్రమే ఈ ఘనతను సాధించాయి. అత్యంత సంక్లిష్టమైన ఉపరితల ప్రాంతాన్నికలిగివున్న దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం మనదే.
నేషనల్ స్పేస్ డే..
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివ్ శక్తిగా నామకరణం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అదే సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకొందామనీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నేడు తొలి నేషనల్ స్పేస్ డేను జరుపుకొంటోంది దేశం. నాటి ఘన విజయాలను మరోసారి గుర్తు చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications