Asia Cup 2023: ఫైనల్లో భారత్-పాక్ మ్యాచ్ ? రేపటి మ్యాచ్ లో ఇదే కోరుకుంటున్న ఫ్యాన్స్..!
రెండే రెండు మ్యాచ్ లతో ఆసియాకప్ టోర్నీ ఒక్కసారిగా హీట్ పెంచేసింది. భారత్-పాక్, భారత్-శ్రీలంక మ్యాచ్ ల తర్వాత ఆసియా కప్ పై చర్చ అమాంతం పెరిగింది. ఈ రెండు మ్యాచ్ ల్లో రెండు పరస్పర భిన్నమైన పరిస్దితుల్లో భారత్ సాధించిన ఘనవిజయాలు అభిమానుల్లో టీమిండియాపై అంచనాల్ని మరింత పెంచేశాయి. అదే సమయంలో చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్ ఉంటే చూడాలనే ఆసక్తి కూడా పెరుగుతోంది.
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ అమాంతం రెచ్చిపోయింది. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అర్ధసెంచరీలతో తొలి వికెట్ కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పితే..ఆ తర్వాత వచ్చిన విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ ఏకంగా సెంచరీలతో రెచ్చిపోయింది. దీంతో భారత్ 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్కోరు చూడగానే పాకిస్తానే సగం చచ్చిపోయింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి అపసోపాలు పడుతూ 228 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యింది. దీంతో భారత్ పాకిస్తాన్ పై రికార్డు విజయాన్ని అందుకుంది.

దీంతో ఇప్పుడు మరోసారి ఆసియాకప్ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అందుకు సమీకరణాలు కూడా సహకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమిపాలైన బంగ్లాదేశ్ సూపర్ 4 నుంచి నిష్కృమించింది. అలాగే భారత్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఘన విజయాలతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక మిగిలించి పాకిస్తాన్, శ్రీలంక. ఈ రెండు జట్ల మధ్య జరిగే సూపర్ 4 మ్యాచ్ లో ఫలితం ఇప్పుడు ఫైనల్ కు వెళ్లేదెవరో తేల్చేయబోతోంది.
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య రేపు ఆసియాకప్ సూపర్ 4 పోరు జరగబోతోంది. ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లతో ఉన్నాయి. అయితే ఈ పోరులో శ్రీలంక గెలిస్తే మాత్రం 4 పాయింట్లు సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లడం ఖాయం. అలాగే పాకిస్తాన్ గెలిచినా పాయింట్ల ఆధారంగా ఫైనల్ చేరడం ఖాయం. కానీ ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం పాకిస్తాన్ కంటే మెరుగైన రన్ రేట్ తో ఉన్న శ్రీలంక ఫైనల్ చేరే అవకాశాలున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. అప్పుడే ఫైనల్లో భారత్-పాక్ పోరు చూడొచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications