Ind-Pak Match: హ్యాండ్ షేక్ తప్పేంటి ? అలా అయితే ఆడొద్దు-అజారుద్దీన్ షాకింగ్ ..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న ఆసియాకప్ 2025 టోర్నీపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో లీగ్ మ్యాచ్ ఆడొద్దంటూ దేశంలో నిరసనలు వ్యక్తమైనా అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం భారత్ ఈ మ్యాచ్ ఆడి గెలిచింది. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లతో దూరాన్ని పాటించింది. పాకిస్తాన్ ఆటగాళ్లకు టీమిండియా క్రికెటర్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు.
ఎన్డీటీవీ చర్చలో క్రికెటర్ నిఖిల్ చోప్రాతో మాట్లాడుతూ అజారుద్దీన్.. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడంలో తప్పు లేదని వెల్లడించారు. ఓ సాధారణ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారన్న వాదనను అజర్ తోసిపుచ్చాడు. కరచాలనం చేయడంలో తప్పు లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు, షేక్ హ్యాండ్స్ లేదా ఏదైనా చేయవచ్చని, ఇందులో సమస్య ఏమిటో తెలియడం లేదన్నారు. ఇందులో తప్పేముందన్నారు.

నిరసన మనస్తత్వంతో మ్యాచ్ లు ఆడటంపైనా అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు నిరసనతో ఆడుతున్నప్పుడు, మీరు పూర్తి స్ధాయిలో ఆడలేకపోవచ్చన్నారు. నిరసనతో ఆడి ప్రయోజనం లేదని, ఓసారి ఆడటానికి అంగీకరించిన తర్వాత అది ఐసీసీ ఈవెంట్‌లు అయినా లేదా ఆసియా కప్ అయినా మీరు పూర్తి సీరియస్ నెస్ తో ఆడాలన్నారు. లేకపోతే, అస్సలు ఆడవలసిన అవసరం లేదన్నారు.

మ్యాచ్ లో ప్రత్యర్ది ఆటగాళ్లు భారత ఆటగాళ్లను ఏదైనా చెడుగా మాట్లాడి ఉండొచ్చని, అందుకే గంభీర్, సూర్యకుమార్ బయటికి వెళ్లి ఆటగాళ్లను హ్యాండ్ షేక్ ఇవ్వొద్దని చెప్పి ఉండొచ్చని అజారుద్దీన్ వెల్లడించారు. ఇటువంటి వివాదాలు ఆటగాళ్ల ఫోకస్ ను ప్రభావితం చేస్తాయని, ఐసీసీ టోర్నీల్లో నిరసనలకు దిగడం అంత తెలివైన పని కాదన్నారు. అదే సమయంలో ప్రతి పోటీకి దాని స్వంత డైనమిక్స్ ఉంటుందన్నారు. తాను గతంలో ఆడిన మ్యాచ్ లలో ఇలాంటి పరిస్ధితులు ఎదురుకాలేదన్నారు. ఇవాళ ఆసియాకప్ లో భారత్-పాక్ సూపర్ 4 పోరుకు ముందు అజారుద్దీన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications